జంక్‌ఫుడ్ అనగానే ఎవరికైనా తప్పక నోరూరుతుంది. సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తినాలని ఎవరికైనా అనిపించడం సర్వసాధారణం. ఒకప్పుడైతే ఇంట్లొనే ఏదో ఒకటి చేసేవారు. కాని ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చేస్తున్నాయి. మరి ఇంక ఎవరికి చేయాలనిపిస్తుంది చెప్పండి. ఈజీగా.. మనకు నచ్చిన స్టైల్లో, నచ్చినవి ఆర్డర్ చేసుకుని తినేస్తున్నాం.
పిజ్జాలు, బర్గర్లు, కుకీస్, స్వీట్లు, ఇతర జంక్‌ఫుడ్‌ను తినడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఆహార పదార్థాలను ఎవరైనా ఇష్టంగానే తింటారు. కానీ వాటిని తింటే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి వాటిని తినడం ఎలా? అంటే.. అందుకు ఓ ఉపాయం ఉంది. ఏం లేదు.. వాటి వాసన పీల్చుకోండి. అవును. 2 నిమిషాల పాటు అలా ఆ ఆహార పదార్థాల వాసన చూస్తే చాలు మీకు వాటిని తినడంతోపాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది మేం చెబుతున్నది కాదు, సైంటిస్టుల పరిశోధనలో తేలింది.
జర్నల్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. సైంటిస్టులు కొందరికి 30 సెకండ్ల పాటు పలు కుకీల వాసన చూపించారు. దీంతో వారికి ఆ కుకీలను తినాలనే ఆసక్తి కలిగింది. తరువాత వారికి 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పాటు పిజ్జాలు, స్ట్రాబెర్రీల వాసన చూపించారు. దీంతో వారికి పిజ్జాల మీద ఆసక్తిపోయింది. కడుపు నిండిన భావన కలిగింది. ఇక ఆ ఆహారాలను తినాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుందని, దీంతో శరీరంలో అదనపు క్యాలరీలు చేరకుండా చూసుకోవడంతోపాటు అధిక బరువు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.