సన్నగా, నాజూగ్గా ఉన్న అమ్మాయిలకే అన్ని రకాల బట్టలు నప్పుతాయనేది ఎప్పటినుంచో వింటున్న మాటలే. మరి బొద్దుగా ఉన్న అమ్మాయిల పరిస్థితేంటి..? వాళ్లు ఎలాంటి కలర్స్ ఎంచుకోవాలి..? అలాంటి వాళ్ల కోసమే రకరకాల కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లోకి వచ్చాయి. మరి ఏ డిజైన్స్ వేసుకుంటే సన్నగా కనిపిస్తారో తెలుసుకోవాలంటే ఆలస్యమెందుకు..? కిందున్న వాటిని పాటించేయండి. కూల్‌గా ఉండండి.
బొద్దు భామల ఫ్రెండ్లీ కలర్ బ్లాక్ అనే చెప్పొచ్చు. ఈ రంగులో వారు సన్నగా కనిపిస్తారనే చెప్పాలి. అలానే.. ముదురు రంగులు, లేలేత ఛాయలు కూడా వీరికి బాగుంటాయి. రెండుమూడు రంగుల్ని కాకుండా పై నుంచి కిందకు సాదాగా ఒక్క రంగునే ఎంచుకోవడం మేలు. ఎప్పుడూ అలాంటివేనా! అనుకుంటే చిన్నచిన్నమార్పులు చేసుకోవచ్చు. అంటే వాటికి పాకెట్స్ పెట్టించుకుని అవి ప్రింటెడ్ లేదా కాంట్రాస్ట్ కలర్లో ఉండేటట్లు చూసుకుంటే చాలు. అలాగే.. అనార్కలీలు ఎంచుకోవాలనుకున్నప్పుడు ఏ లైన్స్ బాగుంటాయి. అయితే స్లిట్ లేకుండా చూసుకోండి. వీటి మీదకు దుపట్టాలను ఎంచుకునేటప్పుడు మామూలు రకాల్ని కాకుండా డ్రేప్ తరహాలో వేసుకోవచ్చు. అలానే మెడ విషయానికి వస్తే… షర్ట్కాలర్ రకాలకంటే ఓపెన్కాలర్స్ బాగుంటాయి. భుజాలు వెడల్పుగా కనిపించకుండా చేస్తాయి.
ఇక నార్మల్ టాప్స్ అయినా.. వెస్ట్రన్ టాప్‌లు అయినా సరే! ఎంపైర్లైన్ ఎంచుకుంటే చాలు పొట్టభాగం హైలెట్ కాదు. జార్జెట్, సిల్క్, క్రేప్, హ్యాండ్లూమ్ రకాలు వీరికి సౌకర్యంగా ఉంటాయి. సన్నగా కనిపించేలా చేస్తాయి. పారదర్శకంగా కనిపించే వస్త్రరకాలతో టాప్ కుట్టించుకుని దానికి జతగా బ్లూ డెనిమ్ వేసుకుంటే వావ్ అనిపించడం ఖాయం. లావుగా ఉన్నవారికి జాలువారే స్కర్ట్లు అంతగా బాగోవు అనుకుంటారు. కానీ పేస్టల్ రంగుల్లో లాంగ్ స్కర్ట్‌ని ఎంచుకుని దానిమీదకు సాలిడ్ కలర్ టాప్ వేసుకుని చూడండి. ఎంతందంగా ఉంటుందో. స్కార్ప్ కూడా వేసుకోవచ్చు. అయితే యాక్సెసరీలు మాత్రం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రైప్స్ ఒకప్పుడు లావుగా ఉన్నవారికి అంతగా నప్పవనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు బ్రాండ్స్, డిజైనర్లు కొత్తగా డిజైన్ చేయడం వల్ల అసెమెట్రికల్ స్ట్రైప్స్ బాగుంటున్నాయి.