ఫ్యాబ్రిక్‌తో జ్యువెలరీ

నగలు అనగానే.. బంగారం, వెండి, వజ్రాలు, విలువైన రాళ్లతో తయారుచేసినవే కళ్ల ముందు మెదులుతాయి. నిజానికి అందంగా మలిచిన ఏ నగలు వేసుకున్నా ఆనందంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఫ్యాబ్రిక్‌తో చేసిన నగలు ఎందుకు వేసుకోకూడదు? ఫ్యాబ్రిక్‌ జువెలరీని మీ వస్త్రధారణకు ఎలా మ్యాచ్‌చేస్తే స్టయిలిష్‌గా ఉంటుందో చూడండి.

పలు స్టయిల్స్‌, డిజైన్లలో తయారయ్యే ఫ్యాబ్రిక్‌ జువెలరీ మీద మనసు పారేసుకోని వారు ఉండరు. చేతితో తయారుచేసిన వాటి నుంచి ఎంబ్రాయిడరీ, ఎంబలిష్‌ డిటెయిలింగ్‌లతో పలు రకాల్లో ఉంటాయి ఇవి. సింపుల్‌గా, అందంగా ఉండే నగలు కావాలంటే ఫ్యాబ్రిక్‌కు ఓటేయాల్సిందే. ఫ్యాబ్రిక్‌, దారాలతో తయారుచేసే ఈ నగల్లో రంగుల హరివిల్లు కనువిందు చేస్తుంది. ఈ జువెలరీని ప్రింటెడ్‌, ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ లేదా దారాలతో తయారుచేస్తారు. వీటికి సంప్రదాయ, భిన్నమైన లుక్‌ తేవడం కోసం బంగారం లేదా వెండి పూసలను చేరుస్తారు.

న్యూట్రల్‌, ఎర్తీ లేదా పేస్టల్‌ కలర్స్‌ డ్రెస్‌లకు మరిన్ని రంగులు అద్దాలంటే ముదురు రంగులతో తయారుచేసిన నెక్లెస్‌ లేదా చెవి పోగులు పెట్టుకోవాలి. వీటిమీద అద్దాలు లేదా వెండి హంగులు చేర్చితే బాగుంటుంది. మిగిలిపోయిన ఫ్యాబ్రిక్‌ వాడి నగలను తయారుచేస్తారు. ఏ ప్రాంతానికి తగినట్టు ఆ ప్రాంతంలో ఇవి తయారవుతాయి. మిగతా వాటితో పోలిస్తే ఇవి ఎకో ఫ్రెండ్లీ నగలు. అంతేకాదు ఇవి వేసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దద్దుర్లు వంటివి రాకుండా ఉంటాయి.

leave a reply