అఖిలపక్షం: తలా.. ఒక మాట..!

విభజన హామీలు, ఏపీకి జరిగిన అన్యాయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశం.. హోటల్ ఐలాపురంలో జరిగింది. వైసీపీ మినహా బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. ప్రత్యేకంగా ఏమైనా కార్యాచరణ చేపట్టాలా లేదా అన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ సహా పలువురు ఈ అఖిలపక్షం, మేధావుల భేటీకి హాజరయ్యారు. పవన్‌ కళ్యాణ్‌, సీపీఐ రామకృష్ణ, జస్టిస్ చలమేశ్వర్, బీజేపీ నుంచి ఐవైఆర్ కృష్ణారావు, టీడీపీ నుచి సోమిరెడ్డి, నక్కా ఆనందబాబు, కుటుంబరావు హాజరయ్యారు. వైసీపీ నేతలు మాత్రం హాజరు కాబోమని ప్రకటించి దూరంగా ఉన్నారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై అందరం కలిసి పోరాడాలని సమావేశంలో పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలనేదానిపై..భిన్నాభిప్రాయాలు ఉన్నాయని… అయితే ఏపీకి అన్యాయం జరిగిందని అందరూ అంగీకరించారన్నారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. ఈ సమయంలో కూడా మనం పోరాడకపోతే.. ఇంకా ఎప్పటికీ న్యాయం జరగదని పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

రావాల్సిన హోదా, నిధులపై భిన్నాభిప్రాయాలు లేవని.. కేంద్రం ఇంకా రూ. లక్షా 16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి సోమిరెడ్డి సమావేశంలో లెక్కలు చెప్పారు. మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ సమస్యల్ని పరిష్కరించడానికి..ఇప్పటికీ కేంద్రం ముందుకు రావడం లేదన్నారు. సమావేశానికి వచ్చిన వారంతా ఓ లెక్క చెబుతూండగా.. బీజేపీ తరపున హాజరైన ఐవైఆర్ కృష్ణారావు మరో లెక్క చెప్పుకొచ్చారు. ఈ కారణగా.. ఎన్ని నిధులు రావాలనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

విభజనకే చట్టబద్ధత లేదన్న అంశంపై చర్చ జరగాలని ఉండవల్లి సూచించారు. విభజనచట్టం అమలు చెయ్యకపోవడంపై చర్చ జరగాలని నేతలు పట్టుబట్టారు. మరో వైపు మనకు జరిగిన అవమానాల్ని మర్చిపోకూడదని, సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మనకు దెబ్బతగిలినప్పుడు ప్రతిస్పందించాలని, ప్రతిస్పందించకపోతే సమస్యలు పరిష్కారం కావన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ను తప్పుపట్టడం కాదు.. వ్యవస్థలో ఏం జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలన్నారు.

భారత రాజ్యాంగం ఏర్పడ్డాక ఏ విభజన ఇలా జరగలేదన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవవచ్చు కానీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం పోరాడుదామని పిలుపునిచ్చారు. మొత్తంగా సమావేశం నాలుగు గంటలకుపైగానే సాగింది. సమావేశం అస్పష్టంగా ముగిసింది. సమావేశ తీర్మానం, మరో సమావేశంపై ఏమీ చెప్పలేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

leave a reply