తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

తెలంగాణా వ్యాప్తంగా జరిగిన 2018 ఎన్నికల ఫలితాలకు తెరపడనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8గంటల నుంచి ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపుకై అన్ని రకాల ఏర్పాట్లను ఎలక్షన్‌ అధికారులు పూర్తిచేశారు. ఓట్ల లెక్కింపులో పొల్గొంటున్న సిబ్బందికి రెండు రోజుల ముందు నుంచే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఒక్కోలెక్కింపు కేంద్రంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌, త్రివిధ దళాల్లో పనిచేసిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

తెలంగాణాలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 44 కేంద్రాల్లో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తంగా 2,379 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ అన్నారు. ప్రతి రౌండ్‌లో 14వేల ఓట్ల వరకు ఫలితాలు వస్తాయని తెలిపారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్లు ఉంటాయని.. అతితక్కువగా బెల్లంపల్లిలో 15 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుందని చెప్పారు. లెక్కింపు అధికారులను రాండమ్‌ విధానంలో కేటాయిస్తున్నామన్నారు. అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ కమిషన్‌ దానకిషోర్‌,  హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పరిశీలించారు.

leave a reply