మేమూ వద్దామనుకుంటున్నాం..!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల బాగుండాలని నేను కోరుకుంటున్నా అంటూ..  సీఎం చంద్రబాబుకు కూడా గిఫ్ట్‌ ఇవ్వాలని ఉందంటూ.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి కూడా రావాలంటూ తనకు కూడా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వచ్చాయన్నారు.

మంగళవారం సాయంత్రం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై కామెంట్లు చేశారు. దేశ రాజకీయాలు బాగుచేసుకొనే క్రమంలో తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే తప్పకుండా తాము ఏపీలో కూడా అడుగు పెడతామన్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని, అలాంటిది తాను అక్కడికి వెళ్లి పనిచేయొద్దా? అని కేసీఆర్‌ కామెంట్‌ చేశారు.

చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు మరొకటి తిరిగి ఇవ్వాలి కదా.. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అంటారని చురకలంటించారు. తాను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నికు బదులిచ్చారు. కేసీఆర్‌ ఎవరివైపు ఉంటారో చెప్పాలని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్‌ చేయడాన్ని కేసీఆర్‌ తీవ్రంగా తప్పు పట్టారు. తాను ఎవరివైపు ఉన్నానో అడగడానికి అసలు చంద్రబాబు ఎవరు? అని మండిపడ్డారు. ఏపీలో ఆయన పరిస్థితే చక్కగా లేదని విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారని, అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబుతో పాటు తానూ ఉన్నానని.. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడారో, ఆయన పరువు ఎలా పోయిందో అంతా తనకు తెలుసన్నారు.

leave a reply