ఈ ఆలయానికి ఇదో ప్రత్యేకత

భక్తుల కోరిన కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా చిలుకూరు బాలాజీ దేవాలయం చాలా పేరుగాంచింది. ఈ ఆలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి. తిరుపతిలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఎలాగో.. తెలంగాణాలో అలా అన్నమాట. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని,రెండు తెలుగు రాష్ర్టాల,ఇతర రాష్ర్టాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకుంటారు.

అలాగే.. ఈ మధ్య జరిగిన వివాదాల కారణంగా ఈ ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చింది. ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే.. ఈ ఆలయంలో హుండీ లేకపోవడం విశేషం. అలాగే.. ఈ దర్శన సమయంలో విరామం ఉండదు. ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడం వంటివేవీ లేవు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కూడా ఉండవు. అధికారులు కూడా సామాన్య భక్తులతో పాటే దర్శనం చేసుకోవాలి. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఎలాంటి పూజలు జరపాలో అవే ఉంటాయి. అవి కూడా ఉచిత దర్శనమే.

leave a reply