శ్రీ సీతాసమేతుడై

గోదావరి నది తీరాన వెలసిన పట్టబధ్రుడు భద్రాచలం శ్రీ సీతారాముడు. భద్రాచలం పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలో బాగా పేరుపొందిన పుణ్య స్థలం. భక్తుని కోరిక మేరకు శ్రీరాముడు ఇచ్చిన వరం ప్రకారం సతీ సమేతుడై వెలసిన పుణ్యక్షేత్రం. అలాగే.. లక్ష్మణుడు, ఆంజనేయ సమేతంగా ఇక్కడే కొలువుదీరాడు. భక్తులు ప్రేమగా ఇక్కడ శ్రీరామ చంద్రుడిని వైకుంఠరాముడు అని పిలుస్తూ ఉంటారు. అలాగే.. ఏటా తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తూ ఉంటుంది. బ్రహ్మోత్సవాలను కూడా కమిటీ వారు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు.

చరిత్ర ప్రకారం.. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా, భద్రగిరిపై వెలసిన శ్రీ రాముడికి రామాలయాన్ని నిర్మిస్తాడు. గోపన్న శ్రీరాముడి పరమభక్తుడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థింస్తాడు గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడతాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

ఈ దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.

భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు. సీతారాముల కళ్యాణికి లక్షల సంఖ్యలో ఆలయానికి తరలివస్తారు. అలాగే ఆలయ కమిటీ వారు కూడా కన్నుల పండగగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించడం ఇక్కడ ప్రత్యేకత.

leave a reply