ఉత్కంట పోరులో అద్భుత విజయం

మొదటి మ్యాచ్‌లో తృటిలో తప్పిన విజయం తర్వాత తప్పక గెలవాల్సిన అడిలైడ్‌ వన్డేలో కోహ్లీసేన అదరగొట్టింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం టీమిండియాను వరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్‌మెన్‌ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. పరుగుల యంత్రం, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(104) శతకంతో రాణించిన వేళ రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. కంగారూలు నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ధాటిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌లు దూకుడుగా ఆడారు. అయితే, 7.4ఓవర్‌లో బెహ్రన్‌డార్ఫ్‌ బౌలింగ్‌లో ధావన్‌(32) ఔటయ్యాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన ఈ జోడీని స్టాయినిస్‌ విడదీశాడు.

 43 పరుగులు చేసి అర్ధ సెంచరీకి చేరువవుతున్న రోహిత్‌శర్మ.. హ్యాండ్స్‌కోంబ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు(24) కొద్ది సేపటికే ఔట్‌ కావడంతో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. ధోని రాకతో కోహ్లికి మంచి భాగస్వామి దొరికాడు. ఇరువరూ వికెట్ల మధ్య పరుగులు తీస్తూ, అడపాదడపా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును వేగం పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వన్డేల్లో విరాట్‌ 39వ శతకాన్ని నమోదు చేశాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉన్నా, ఈ జోడీ  ఉందని ధైర్యంగా ఉన్న అభిమానులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. సెంచరీతో జోరు మీదున్న కోహ్లి (104)ని రిచర్డ్‌సన్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 82 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. భారత ఇన్నింగ్స్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం గమనార్హం.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ 25(14) సాయంతో మిస్టర్‌ కూల్‌ ధోని 55(54) భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో సిక్స్‌ కొట్టి అర్ధశతకాన్ని పూర్తి చేయడమే కాకుండా భారత్‌ విజయాన్ని ఖరారు చేశాడు ధోని. ఆసీస్‌ బౌలర్లలో బెహ్రన్‌డార్ఫ్‌, రిచర్డ్‌సన్‌, స్టొయినిస్‌, మ్యాక్‌వెల్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ షాన్‌ మార్ష్‌ శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని 123 బంతుల్లో 131 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. వన్డేల్లో మార్ష్‌కిది 7వ శతకం. మార్ష్‌కి తోడుగా మ్యాక్స్‌వెల్‌(48: 37 బంతుల్లో) తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు.

వీరిద్దరూ ఆరో వికెట్‌కు 94 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత తడబడిన భారత బౌలర్లు ఆఖరి ఓవర్లలో విజృంభించడంతో కేవలం 15 పరుగుల తేడాతో ఆసీస్‌ చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. స్టాయినిస్‌ 29, ఖవాజా 21, హ్యాండ్స్‌కాంబ్‌ 20, కారే 18, నాథన్‌ లైయన్‌ 12, ఫించ్‌ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 4, షమీ 3 వికెట్లు తీయగా.. జడేజా 1 వికెట్‌ పడగొట్టాడు.

leave a reply