కాశీ ‘విశాలాక్షీ’గా

కాశీ లేదా వారాణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. పరమశివుడు స్థావరమైన కాశీని స్వయంగా శివుడే నిర్మించి, పాలించాడని భక్తుల నమ్మిక.

అలాగే.. శక్తిపీఠాల్లో ఒకటి ‌శ్రీ ‘విశాలాక్షీ’ శక్తి పీఠం కాశీలో ఉంది. సతీదేవి ‘మణికర్ణిక’ (చెవి దిద్దు) ఈ ప్రదేశంలో పడిందని చెబుతుంటారు. అలాగే.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఇక ఇక్కడి అమ్మవారికి విశాలాక్షి అనే పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన కథ వినిపిస్తోంది.

భూలోకంలో అధర్మం పెరిగిపోతుండటంతో, పరిపాలన చేపట్టి ధర్మాన్ని కాపాడమని ‘దివో దాసు’అనే క్షత్రియుడిని కోరాడు బ్రహ్మదేవుడు. అయితే దేవతలంతా భూలోకం విడిచి వెళితేనేగాని తాను పరిపాలనా బాధ్యతలను స్వీకరించనని దివోదాసు తేల్చిచెప్పాడు. ఆ సమయంలోనే శివుడు కూడా కాశీ నగరాన్ని వదలి కైలాసానికి వెళ్లిపోయాడు. కాలం గడుస్తున్నా కొద్దీ కాశీ నగర వియోగాన్ని పరమ శివుడు తట్టుకోలేకపోయాడు. దివోదాసు భూలోకాన్ని ప్రజారంజకంగా పాలిస్తుండటం వల్ల, అతనికి ఇచ్చిన మాటను కాదని కాశీకి రాలేకపోయాడు. ఇది గమనించిన వినాయకుడు దివోదాసుకి వైరాగ్యాన్ని కలిగించి, అతనే శివుడిని ఆహ్వానించేలా చేశాడు.

దివోదాసు ఆహ్వానం అందుకున్న శివుడు ఆనంద తాండవం చేస్తూ కాశీ క్షేత్రంలో కాలుపెట్టాడు. పట్టరాని ఆనందంతో వస్తోన్న శంకరుడిని పార్వతీదేవి తన కళ్లను విశాలం చేసుకుని చూస్తూ మురిసిపోయిందట. ఈ కారణంగానే అమ్మవారిని విశాలాక్షి అని పిలుస్తూ వుంటారు.

కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మంధిరం ఉంటుంది శివడుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయ పూజలు రెండు వేలల నాట్టు కోట్టై నగర సత్తరం వారిచే నిర్వహించబడుచున్నది.

leave a reply