ఎం.ఎస్ ధోని పెవిలియన్…రాంచీ!

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. క్రికెట్ కెరీర్ ఆరంభించిన అతి కొద్దీ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రికెటర్‌గానే కాకుండా అటు కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా, కీపర్‌గా పలు విజయాలు సొంతం చేసుకున్నాడు. అయితే ధోని క్రికెటర్ గానే కాకుండా మంచి విద్యార్థి, మంచి తండ్రి, మంచి భర్త, మంచి ఆటగాడిగా.. అంతకు మించి గొప్ప దేశభక్తి ఉన్న భారతీయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీకి ఇప్పుడు తన సొంతూరిలో అరుదైన గౌరవం దక్కింది. రాంచీలో ఉన్న జేఎస్‌సీఏ స్టేడియంలోని సౌత్‌ స్టాండ్‌కు ‘ఎంఎస్‌ధోనీ పెవిలియన్‌’ అని పేరు ఖరారు చేసారు. దీనికి సంబంధించిన ఫొటోలను ధోనీ అభిమానులు ఇంటర్ నెట్ లో  పోస్ట్‌ చేశారు. దీంతో ఇవి వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో మైదానంలోకి వచ్చిన ఓ అభిమాని ధోనీ కాళ్లఫై పడబోగా, ఆ అభిమాని చేతిలో జాతీయ జెండా ఉండటంతో అది కింద పడబోగా దాన్ని కింద పడనీయకుండా ధోనీ సమయస్ఫూర్తితో పట్టుకొని దేశంఫై తనకున్న భక్తిని చాటుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు రాంచీలోని జె.ఎస్.సి.ఏ స్టేడియంలోని సౌత్ స్టాండ్ కు ధోని పేరును పెట్టినట్లు ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు తెలిపింది. దేశానికి గొప్ప కీర్తిని తీసుకొచ్చిన ధోని పేరును పెట్టడం తమకు గర్వంగా ఉందని తెలిపారు. ఈనెల 24 నుంచి జరగబోయే ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కి ప్రస్తుతం ధోనీ సిద్దమవుతున్నాడు.

leave a reply