ఎన్టీఆర్‌ ‘పునర్జన్మదర్శనం’ -వర్మ

నిత్యం ఏదో ఒక వివాదానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరు అంటే..? డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ అనే చెప్పాలి. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో ఆయన మరిన్ని వివాదాలకు తావులేపారు. ఎంతమంది బెదిరించినా.. నేను మాత్రం సినిమా ఖచ్చితంగా తీసి తీరతానని ఆయన తెగేసి చెప్పడంతో.. అటు అభిమానుల్లోనూ.. ఇటు టీడీపీ వర్గీయుల్లోనూ తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతున్నారు.

అయితే.. శుక్రవారం ఎన్టీఆర్‌ వర్థంతి కారణంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు సంబంధించి ఓ ముఖ్యమైన వీడియోను  ఆయన విడుదల చేశారు. ‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పునర్జన్మదర్శనం’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్ కనిపిస్తారు. కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ, ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ ఎన్టీఆర్‌ పాత్ర కనిపిస్తుంది. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నట్లు వర్మ ముందుగానే చెప్పారు. నిజమైన కథను చూపించబోతున్నట్లు వర్మ పలు సందర్భాల్లో తెలియజేశారు.

కాగా.. ఎన్టీఆర్‌ పాత్రలో నటించే నటుడు ఎవరో ఇంకా చెప్పలేదు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. లక్ష్మీపార్వతి, నారా చంద్రబాబు పాత్రల లుక్‌లను కూడా ఇటీవలె వర్మ విడుదల చేశారు. ఈ సినిమాని రాకెష్‌ రెడ్డి నిర్మించగా, కల్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు.

leave a reply