కరుణామూర్తి ‘సాయిబాబా’

‘సబ్‌ కా మాలిక్‌ ఏక్‌’ (అందరి దేవుడూ ఒక్కరే) అంటూ ముందుకొచ్చారు బాబా. ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతిలకు మారు రూపే సాయి బాబా అనిచెప్పొచ్చు. ఎప్పుడూ నిర్మలంగా, నిష్కంకలంగా బాబా కనిపిస్తారు. షిర్డీ గ్రామంలో వెలసిన సాయిబాబా అసలు పేరు కానీ, జన్మస్థలం కానీ ఎవరికీ తెలియదు. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఇలా అన్ని రకాల వారు కలిసి బాబాను నమ్మేవారు. షిర్డీలో ఆయన లీలలు కోకల్లలు అని అనొచ్చు. దైవం ఉందా..? అనే మాటకు నిదర్శనంగా సాయిబాబా మందిరం మనకు సాక్ష్యంగా నిలుస్తుంది. సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారుగానే ఉన్నారు.

అలాంటి కరుణామూర్తి నివసించి తిరుగాడిన ప్రాంతమే షిర్డీ. షిర్డీ గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ జిల్లాలో నాసిక్‌ నుంచి 80 కి.మీలో ఉంది. సాయిబాబాతో షిర్డీ గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది. రోజు కొన్ని లక్షల మంది సాయిబాబాను దర్శించుకుంటూ ఉంటారు. అలాగే బాబా వల్ల తమ కష్టాలు తీరుతాయని కూడా భక్తుల నమ్మకం. కుష్ఠు రోగులకు సైతం ఆయన దగ్గర ఉండి మరీ సపర్యలు చేసేవారు. అతి భయంకరమైన ప్లేగు వ్యాధికి కూడా బాబా మందులు కనిపెట్టాడు. తను చనిపోయిన తరువాత ఆయన నివసించే మసీదులోనే సమాధి చేశారు. నా అవసరం వచ్చిన ప్రతీ వారికి నా సమాధి నుంచే సమాధానమిస్తాను అంటూ చెప్పి ఆయన మరణించారు.

1.షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.

2.మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.

3.నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.

4.నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.

5.నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.

6.నా సమాధినుండి నేను మాట్లాడుతాను.

7.నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.

8.మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.

9.మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.

10.నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.

11.నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.

ఇవీ.. చివరిగా బాబా భక్తులకు తెలియజేసిన మాటలు.

leave a reply