బుర్ర పగిలిపోతుందా.. ఇలా చేస్తే సరి..!

మ‌న‌కు క‌లిగే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి కూడా ఒక‌టి. నిత్యం చాలా మంది త‌ల‌నొప్పితో ఇబ్బందులు ప‌డుతుంటారు. సాధార‌ణంగా మ‌న‌కు త‌ల‌నొప్పి ప‌నిఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూట‌ర్ ముందు కూర్చుని ప‌నిచేయ‌డం, మాన‌సిక ఆందోళ‌న‌ త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. దీంతోపాటు చ‌లికాలంలో వీచే గాలుల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తూ ఉంటుంది. అయితే ఎలా వ‌చ్చినా కింద సూచించిన ప‌లు చిట్కాలు పాటిస్తే త‌ల‌నొప్పి స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒకసారి ఈ కింది విధంగా ట్రై చేయండి.

నిత్యం స‌రిప‌డిన‌న్ని నీళ్లు తాగ‌క‌పోతే త‌ల‌నొప్పి వస్తుంది. కాబట్టి రోజూ మ‌నం త‌గిన మోతాదులో నీటిని తాగాలి. ఈ త‌ర‌హా త‌ల‌నొప్పి అయితే స‌రిగ్గా నీటిని తాగితే వెంట‌నే త‌గ్గిపోతుంది. నిద్ర లేక‌పోయినా, ఎక్కువ‌గా నిద్రించినా త‌ల‌నొప్పి వ‌స్తుంది. క‌నుక రోజూ స‌రిప‌డిన‌న్ని గంట‌ల పాటు మాత్ర‌మే ఎవ‌రైనా నిద్రించాల్సి ఉంటుంది. లేదా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. అలాగే గోరువెచ్చని ఆవు పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. భోజనంలో నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల తలనొప్పి తగ్గుతుంది. టీస్పూన్ వెల్లుల్లి రసం తాగినా త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. మంచి నీళ్లలో ధనియాల పొడి, చక్కెర కలిపి తాగితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

గంధం చెక్కను అరగదీసి ఆ పేస్టును నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వెచ్చబెట్టి మర్దనా చేసుకున్నా తలనొప్పి తగ్గుతుంది. యూకలిప్టస్ తైలంతో మర్దనా చేసి కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. నిద్రించడానికి ముందు రోజూ పావుగంట సేపు పాదాలను వేడి నీటి బకెట్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ తలనొప్పి తగ్గిపోతుంది. మూడు వారాల పాటు ఇలా చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. తరచుగా తలనొప్పి బారిన పడేవారు వెన్న, చాక్లెట్లు, మాంసాహారం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.

leave a reply