తొమ్మిదితో ముగుస్తుంది.. కానీ, ఏమి సాధించారు..!

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రను జనవరి తొమ్మిదో తేదీన ముగించాలని నిర్ణయించారు. గత ఏడాది నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభమయింది. జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదాయత్ర ముగుస్తుండటంతో అక్కడ భారీ పైలాన్ నిర్మిస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 134 నియోజకవర్గాలను కవర్ చేసినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. దాదాపుగా పద్నాలుగు నెలల పాటు సాగిన పాతయాత్ర… నిరాటంకంగా సాగలేదు. ప్రతీ శక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. మధ్యలో పండుగలు, ప్రత్యేకహోదా బంద్ ల కారణంగా అక్కడక్కడా విరామం వచ్చింది. సగటున రోజుకు ఎనిమిది నుంచి 9 కిలోమీటర్ల మేర నడిచారు. పాదయాత్ర ముగింపును అత్యంత ఆర్భాటంగా చేయాలని వైసీపీ నిర్ణయించారు. ఇందు కోసం నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.

ఎన్నికల ప్రకటన.. ఫిబ్రవరి నెలలోనే ఉంటుందని ప్రచారం జరుగుతున్న సమయంలో… ఎన్నికల సన్నాహాలను.. జగన్ మరో నెలలోనే పూర్తి చేసుకోవాల్సి ఉంది. పాదయాత్రలో చాలా వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినప్పటికీ.. ఎప్పటికప్పుడు.. అనేక నియోజకవర్గాల్లో ఇన్చార్జులను మార్చడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. లోక్ సభ ఎన్నికలు వస్తూండటంతో.. బలమైన పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఖరారు చేయాల్సి ఉంది.

ఇప్పటికే ఏ ఒక్క చోట కూడా.. ఫలానా ఎంపీ అభ్యర్థి గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. బలమైన అభ్యర్థులు అనుకున్న వాళ్లు కూడా ఫలానా చోట పోటీ చేస్తారని వాళ్లకే గ్యారంటీ లేకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూండటం వల్ల మిగతా చోట్ల పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో క్యాడర్ అంతా నిదానంగా ఉంది.

పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలను… బస్సుయాత్ర ద్వారా కవర్ చేస్తానని.. గతంలో.. జగన్ ప్రకటించారు. ఇప్పటికిప్పుడు.. మళ్లీ బస్సుయాత్ర చేపట్టం సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు. ఎన్నికల ప్రచారం లో భాగంగా. ఇక అన్ని నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి… ఆగుతూ సాగినా.. పాదయాత్రను పూర్తి చేస్తున్నారు. వైఎస్ పాదయాత్రతో పోల్చుకునే పరిస్థితి లేకపోయినా… తండ్రిలాగే పాదయాత్ర చేశాడని చెప్పుకోవడానికి బాగుంటుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే…పాదయాత్రకు క్రెడిట్ వస్తుంది. లేకపోతే.. షర్మిల పాదయాత్రలా ప్రాధాన్యం లేకుండా ఉండిపోతుంది.

leave a reply