ధోని రికార్డును సమం చేసిన రోహిత్!

విదేశీ గడ్డపై ఆడలేదన్న అపవాదను పటాపంచలు చేస్తూ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా… ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో తన అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తుంది. ఇప్పుడు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్‌ (62; 77 బంతుల్లో 3×4, 2×6)లతో చెలరేగడంతో ఐదు వన్డే మ్యాచ్ సిరీస్‌లో 3-0తో విజయం వరించింది. మైదానంలో రోహిత్‌ పాతుకుపోయాడంటే పరుగుల వరద పారాల్సిందే. మూడో మ్యాచ్‌లో 62 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ధోనీ రికార్డును సమం చేశాడు.

ఇప్పటికే ధోని మొత్తం 337 వన్డేలు ఆడి 222 సిక్సులు బాదాడు. వాటిలో ఏడు సిక్సర్లు ఆసియా XI జట్టు తరఫున సాధించాడు. సోమవారం రెండు సిక్సులు సాధించడంతో రోహిత్‌ తన ఖాతాలో 215 సిక్సులను వేసుకున్నాడు. దీంతో ధోనీ రికార్డును సమం చేశాడు. కండరాలు పట్టేయడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆడకపోవడం తెలిసిందే.. భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్ల జాబితాలో ధోనీ, రోహిత్‌ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్ 195 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సౌరవ్‌ గంగూలీ 189 సిక్సులతో, యువరాజ్‌ సింగ్‌ 153లతో తరువాతి స్థానంలో ఉన్నారు.

leave a reply