పోరాటయోధుడు ఇకలేరు..!

సోషలిస్టు నాయకుడు, నిరంతరం ప్రజల పక్షాన నిలబడ్డ నేత జార్జి పెర్నాండెజ్ (1930-2019) చనిపోయారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉండేవారు. తర్వాత 2009-10 మధ్య రాజ్యసభ్యుడు. చాలాకాలంగా అల్జీ మర్స్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. భారత దేశ పార్లమెంటరీ రాజకీయాల్లో విశిష్టమయిన వ్యక్తుల్లో జార్జి ఒకరు. రక్షణ మంత్రిగా ఉన్నపుడు న్యూఢిల్లీ 3, కృష్ణ మీనన్ మార్గ్ లో ఉండేవారు. ఆయన ఇంటికి గేటు వేసేవారు కాదు, సెక్యూరిటీ వుండేది కాదు, ఎవరైనా లోనికి వెళ్లవచ్చు.

బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, కమెండోల హడావిడితో రోడ్ల మీద సెక్యూరిటీ టెర్రర్ సృష్టించడంమే స్టేటస్ అనుకునే  లీడర్లున్న ఈ కాలంలో ఫెర్నాండెజ్ ను వూహించడమే కష్టం. ఇంటినిండా బర్మా కాందిశీకులుండేవారు. ఒక్క సారి కూడా ఎవరూ అడ్డగించలేదు. ఇస్త్రీ కూడా లేని లాల్చి, పైజామా వేసుకుని వచ్చే కార్యాలయానికి, పార్లమెంటుకు వచ్చే వాడు.

1975-77 ఎమర్జీన్సీ కాలమంతా జైలులో ఉండిన వాడు. ఆయన కర్నాటక వాడు. చిన్నపుడు హోటల్ లో వర్కర్ గా పని చేశాడు.(కేంద్రమంత్రి అయ్యాక కూడా అదే హోటల్ బాయ్ సింప్లిసిటీ తో బతికారు. అపుడే ఆయన నాటి కార్మిక నాయకుడు పి.డిమెలో కంట పడ్డారు. ఆయన శిష్యరికంలో ఫైర్ బ్రాండ్ ట్రేడ్ యూనియన్ నాయకుడయ్యారు. నాటి బొంబాయిని శాసించే కార్మిక నాయకుడయ్యాడు. చిటికె వేస్తే బొంబాయిని స్తంభింప చేసే శక్తి వంతుడయ్యాడు. ఆయన నాయకత్వంలో 1.5 లక్షల మంది మునిసిపల్ కార్మికులు, టాక్సి డ్రైవర్లు, బెస్ట్ ఉద్యోగులు ఉండే వారు.

1967లో మహారాష్ట్ర కాంగ్రెస్ మహాబలుడు ఎస్‌కె పాటిల్ ను ఓడించి లోక్ సభ లో ప్రవేశించారు. ఎస్ కె పాటిల్ కంటే కాంగ్రెస్ పార్టీకి ఖజానా.ఆయనను ఎదిరించే వాడ లేడు. ఫెర్నాండెజ్ అలవోకగా ఆయన్ని వోడించారు. అపుడే ఆయనకు జెయింట్ కిల్లర్ అనే పేరు వచ్చింది. దేశాన్ని కుదిపేసిన 1974 రైల్వే సమ్మెకు ఆయన నాయకత్వం వహించారు. భారత దేశ కార్మిక ఉద్యమాల్లో ఈ సమ్మె ఒక అధ్యాయమవుతుంది. ఈ సమ్మె గురించి లెక్కలేనంత మంది పిహెచ్ డీలు చేశారు. రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కారించాలని చేసిన ఈ సమ్మెతో దేశమంతా రైల్వే వ్యవస్థ స్తంభించిపోయింది. జార్జి స్వయంగా పట్టాల మీదకు వచ్చి రైల్లు కదలకుండా చేశారు. 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జీన్సీ ప్రకటించేందుకు ఈ సమ్మె ఒక  ప్రధాన కారణమని చెబుతారు.

తర్వాత 1977 లో ముజఫుర్ పూర్ (బీహార్) నుంచి లోక్ సభకు గెలిచారు. జనతాా ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. వెంటనే చేసిన పని,ఐబిఎం, కోకొకోలాని బ్యాన్ చేయడం.1989లో రైల్వే మంత్రిగా ఉన్నపుడు కొంకణ్ రైల్వే నిర్మాణం చేపట్టారు. అయితే, వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్నపుడు ఆశాఖను బరాక్ మిసైల్ కుంభకోణం, తెహెల్కా వివాదాలు చుట్టు ముట్టాయి. ఇది ఆయనకు బాగా అపకీర్తి తెచ్చింది. ఇందులో ఆయన ప్రమేయం లేకపోయినా, 3 కృష్ణ మీనన్ మార్గ్ లోఉంటున్నవాళ్ల ప్రమేమం ఉందని అపుడు వార్తలొచ్చాయి.

మా తరానికి ఆయన హీరో. ఆయనకంటే పెద్ద నాయకులు జనతా ప్రభుత్వంలో ఉండవచ్చు. దేశంలో మొరార్జీ లాంటి నేతలుండవచ్చు. అయినా సరే మోస్ట్ పాపులర్ లీడర్ ఆయనే. ఆయనకున్న హీరో ఇమే జ్ వల్ల జనతా పార్టీ కూడా ఆయన పేరు ను ఉపయోగించుకునేది. కేవలం ఉద్యమాల ద్వారా సామాన్య ప్రజలందరికి పరిచయమయిన, తెలిసిన ముఖం ఆయనది. సినిమా హీరోలను గుర్తుపట్టినంత సులభంగా ఆ రోజులో జార్జిఫెర్నాండెజ్ ని సామాన్య ప్రజలు కూడా గుర్తు పట్టేవారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా అంతా పాపులర్ లీడర్ రాలేదు.  పదవులు ద్వారా, సినిమా గ్లామర్ ద్వారా డబ్బు ద్వారా  రాజకీయాల్లోకి వచ్చిన  పాపులర్ ముఖాలు పార్లమెంటులో చాలా ఉన్నాయి. అయితే, జార్జి ఫెర్నాండెజ్ లాగా ఉన్న వాడు జార్జ్ ఒక్కడే…

గొప్ప వాళ్ల కాలం పోయి, వోట్ బ్యాంక్ కాలం రావడంతో ఫెర్నాండెజ్ వెనకబడి పోయారు. ఎందుకంటే, ఒక నియోజకవర్గం అంటూ ఆయనకు లేదు. దేశమంతా నా నియోజకవర్గం అనుకున్న సత్తెకాలపు మనిషి.అయితే, ఆయనకున్న కాంగ్రెస్ వ్యతిరేకత చివరి రోజుల్లో వెర్రితలలు వేసింది. అంతర్జాతీయ మానవహక్కుల సంఘాల ప్రతినిధిగా ఉండిన జార్జి బిజెపితో చేతులు కలపడమేకాదు,  2002 గుజరాత్ అల్లర్లపుడు ముఖ్యమంత్రి నరేంద్రమోదీని వెనకేసుకు వచ్చారు. దీనితో ఆయనకున్న ప్రతిష్ట దెబ్బతినింది. ఒకపుడు భారత దేశాన్ని కుదిపేసిన ప్రజా రాజకీయాలను నడిపిన నాయకుడు తానేం చేస్తున్నాడో కూడా తెలియనంతగా దిగజారిపోయాడని విమర్శ వచ్చింది. అనారోగ్యమేకాదు, ఆయన దిగజారుడు కూడా  రాజకీయాల్లో ఆయన పతనానికి దారి తీసింది.  1970 దశకం జార్జియేనా ఈయన అని నిట్టూర్చే పరిస్థితి వచ్చింది.

leave a reply