పోలవరంపై చంద్రబాబు..స్పష్టత!

పోలవరం పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు…రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అశ్రద్ధ వహిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీగారి పాలన కేవలం గుజరాత్ వైపే ఉందని ఎద్దేవా చేసారు. అంతేకాకుండా ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారని ఈఒక్క రాష్ట్రానికో కాదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మే నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లందిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన 2019 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 62శాతం పైగా పనులు పూర్తయ్యాయని చంద్రబాబు వెల్లడించారు. అంతేకాకుండా జనవరిలో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి గిన్నిస్ రికార్డు సృష్టిస్తామన్నారు. స్పిల్ వే పనులు 75 శాతం పూర్తి అయ్యాయని.. ప్రాజెక్టులోని అన్ని డిజైన్లకు అనుమతులు వచ్చాయని సీఎం తెలిపారు. భూసేకరణకు రూ.33,235 కోట్లు ఖర్చు అవుతుందన్న సీఎం.. రూ.53,300 కోట్ల కొత్త డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాల్సి ఉందన్నారు. రూ.4వేల కోట్లతో విద్యుత్ కేంద్రం పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉందని చెప్పారు.

తెలంగాణకు పోలవరం వల్ల ఎలాంటి ఇబ్బంది రావని .. అయినా అడ్డంకులను సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఒక్కసారి ప్రాజెక్టు ఆగితే మళ్లీ అడుగు ముందుకు పడదని,ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని తెలియడం లేదని సీఎం విమర్శించారు . మరోమారు ప్రధాని మోదీ, జలవనరుల శాఖ మంత్రి గడ్కరీకి లేఖలు రాస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ఉక్కు కర్మాగారం, రాజధాని అమరావతి నిర్మాణాలను.. రియల్ ఎస్టేట్ వ్యాపారమంటూ ప్రతిపక్ష నేత జగన్‌ విమరసాలు చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి ఆయనకు కనిపించడంలేదని ఎద్దేవా చేసారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తాను మాట్లాడతానని, ఆ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఏంతో ప్రయోజకంగా ఉంటుందన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టునూ ఇంత త్వరగా పూర్తి చేస్తున్న దాఖలాలు లేవన్నారు. ఒడిశాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చర్చించాకున్నారో తనకు తెలియదని చంద్రబాబు అన్నారు.

leave a reply