మళ్లీ తెరపైకి “ ఓటుకు నోటు”

ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నేటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇవ్వజూపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదయింది. రేవంత్ సహా పలువురు జైలుకు వెళ్లి వచ్చారు. తాజాగా, ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ మంగళవారం వేం నరేందర్ రెడ్డిని విచారించింది. ఆయనతో పాటు అతని కొడుకులను కూడా విచారించింది. వారిని నాలుగైదు గంటల పాటు విచారించారు.

విచారణ అనంతరం వేం మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానని అన్నారు. అడిగిన డాక్యుమెంట్లు కూడా అందించానని చెప్పారు. ఈడీ అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు. మూడున్నరేళ్ల తర్వాత ఈ కేసు బయటకు రావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. తాము రాజకీయాల్లో ఉన్నామని, కాబట్టి రాజకీయాల్లో ఇలా అణగదొక్కుతారని తెలుసునని, ప్రశ్నించే వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తారని, కానీ తన కొడుకులను పిలవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి తనతో పాటు తన ఇద్దరు కొడుకులకు కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిందని వేం నరేందర్ రెడ్డి చెప్పారు. ఈ కేసుతో సంబంధం లేని తన కుమారులను పిలవడం బాధాకరమన్నారు. అలాగే, రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం ఉందని తెలిపారు. మరో వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకు (రేవంత్ రెడ్డి) సూచించినట్లుగా తెలిసిందన్నారు. కాగా, రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నెల 19వ తేదీన ఈడీ ఎదుట హాజరు కానున్నారని తెలుస్తోంది.

తనను, తన ఇద్దరు కుమారులను ఈడీ అధికారులు విచారించారని, ముగ్గుర్ని వేర్వేరుగా ప్రశ్నించారని వేం నరేందర్ రెడ్డి చెప్పారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లుగా కనిపిస్తోందని చెప్పారు. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారనే విషయం న్యాయస్థానాలు తేలుస్తాయన్నారు.

leave a reply