జగన్ మీద సెటైర్లే.. సెటైర్లు..!

ముఖ్యమంత్రి పదవి అంటే ఏమైనా తమాషానా, వైసీపీ అధినేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న లెక్క ప్రకారం ఆయన రిటైర్ కావాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ అన్నారు. ఆయన చంద్రబాబు ఢిల్లీ దీక్ష సందర్భంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలు సందర్భంగాల్లో జగన్‌ను ఇమిటేట్ చేస్తూ.. అలా కాదబ్బా.. అంటూ సెటైర్ వేశారు.

45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని జగన్ ప్రకటించారని, మరి ఇక ఆయనకు రాజకీయాలు ఎందుకని, ఆయన కూడా రిటైర్ కావొచ్చునని శివాజీ చెప్పారు. ఆయన కూడా ఇంట్లో కూర్చొని పింఛన్ తీసుకోవచ్చునని చెప్పారు. నేను విమర్శనాత్మకంగా మాట్లాడటం లేదని, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నానని చెప్పారు. 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానంటే, అది నీవే తీసుకొని, ఇంట్లో కూర్చో అబ్బా.. నాన్నగారు ఇచ్చిన దాంతో మనం బ్రహ్మాండంగా సంపాదించుకుందామని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి పదవి అంటే తమాషానా అని శివాజీ అన్నారు. వెనుకాల పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఐఏఎస్‌లు, అధికారులను, మాజీ మంత్రులను జైలుకు పంపించిన వ్యక్తి (జగన్) వెనుకాల నిలబడటం ఏమిటని శివాజీ నిలదీశారు. ఆరుగురు ఐఏఎస్‌లు, ఆరుగురు మంత్రులను జైలుకు పంపిన వ్యక్తి వెనుకాల నిలబడి ముఖ్యమంత్రిని చేస్తామని నిలబడటం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వెనుకాల అధికారులు నిలబడటం ఏమిటన్నారు.

కానీ మనం అట్ల కాదు కదబ్బా.. బెంగళూరులో కూర్చొని మంత్రులను, ఐఏఎస్‌లను పిలిపించి, సంతకాల మీద సంతకాలు పెట్టించి.. అందర్నీ జైలుకు పంపించామని జగన్‌ను ఉద్దేశించి శివాజీ అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీకి సీఎం కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, నేను చంద్రబాబుకు మద్దతిచ్చేందుకో, వారి పార్టీకి సపోర్ట్ చేసేందుకో తాను రాలేదని చెప్పారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌ల కంటే తనకు ఏపీ ముఖ్యమని చెప్పారు. నేను ఏపీలో పుట్టానని, గుంటూరు జిల్లా, చిలకలూరి అసెంబ్లీ నియోకవర్గం పరిధిలో పుట్టానని చెప్పారు. ఆ గడ్డమీద పుట్టిన నాకు తన ప్రాంతం మీద ఉన్న అభిమానంతో న్యాయంగా మాట్లాడుతున్నానని, అలాగే మాట్లాడుతానని చెప్పారు.

చుక్కల భూమిల విషయంలో చంద్రబాబు స్పందించిన తీరు అద్భుతమని చెప్పారు. తనకు చాలామంది ఫోన్ చేసి ఆశీర్వదిస్తున్నారని, చంద్రబాబు బాగుండాలని ఆశీర్వదించాలని వారికి నేను సూచిస్తున్నానని అన్నారు. నేను ఎట్లాగైనా బాగుంటానని, కానీ చంద్రబాబును ఆశీర్వదించాలన్నారు. సమస్యలు పరిష్కరిస్తారనుకుంటేనే ప్రజలు గుర్తిస్తారని, అందుకే చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారని చెప్పారు. అంతేకానీ, నేను ముఖ్యమంత్రిని అవుతానని, నేను సీఎం అయ్యాక అది చేస్తా ఇది చేస్తానంటే ఎలాగన్నారు.

leave a reply