మోడీకి సెగ తగిలినట్టుంది.. రాష్ట్రానికి రావట్లేదు..!

పదో తారీఖున గుంటూరు.. పదహారో తేదీన విశాఖలో నరేంద్రమోడీ బహిరంగసభలు అంటూ.. హడావుడి చేసిన బీజేపీ నేతలు చల్లబడిపోయారు. పదో తేదీన గుంటూరులో బహిరంగసభ ఉందని.. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోగా… ఇప్పుడు అలాంటి సూచనలే లేవని.. ఏపీ బీజేపీ నేతలే తమ చేతల ద్వారా బయటపెట్టుకుంటున్నారు. ఈనెల 27న విశాఖలో ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ.. బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు.

మోడీ పర్యటనకు సంబంధించిన ప్రధానమైన హింటు మాత్రమే ఉండగా.. ఇదే అధికారికంగా కాబట్టి ఇదే నిజం అనుకోవాలి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులో సభ నిర్వహించి దాని ద్వారా భారీగా జన సమీకరణ చేసి తనకు ఉన్న జన బలాన్ని నిరూపించాలని బీజేపీ వాళ్లు ఆరాటపడిపోయారు.

పదో తేదీన సభ అని, ఢిల్లీ నుంచి వచ్చిన సూచనల మేరకో.. మరో కారణమో.. కానీ.. ఆయన మాత్రం బుడంపాడు అనే గ్రామం దగ్గర ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా ఢిల్లీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సహజంగా ప్రధాని పర్యటన అంటే.. ముందస్తుగా.. భద్రతా ఏర్పాట్ల కోసం.. వారం రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. అలాంటిదేమీ లేకపోయేసరికి.. అంతా కన్నా లక్ష్మినారాయణ ఆత్రమనే అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే గుంటూరులో సభలేమీ లేవని ఉంటే గింటే విశాఖలో ఉంటుందని బీజేపీ హైకమాండ్ ఇలా తేల్చి చెప్పేసినట్లయింది.

మామూలుగా అయితే ప్రజల మూడ్ పరిశీలించడానికి అమిత్ షా.. మోడీ పర్యటన కంటే ముందే వచ్చారు. నాలుగో తేదీన బస్సు యాత్ర ప్రారంభించారు. ఆ బస్సు ఆర్టీసీ బస్సులా తిరిగింది తప్ప.. పట్టించుకున్న వారు లేరు. జనం లేక బహిరంగసభను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. టీడీపీ, ఇతర ప్రజాసంఘాలు చేసే నిరసనల కన్నా.. అసలు జనం లేని సభ అంటే… దారుణ పరాభవం కిందే లేక్కని… బీజేపీ పెద్దలు వెనుకడుగు వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్న విశాఖలో అయితే పరువు కాపాడుకోవచ్చని అంచనా వేసినట్లు తెలుస్తోంది.

leave a reply