వైసీపీ కంచుకోటకు బీటలు..!

నెల్లూరు జిల్లా అంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీకి కంచుకోట అటువంటి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైసీపీలో వర్గ వైషమ్యాలు చాపకింద నీరులా ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిల మధ్య ఏర్పడిన రాజకీయ అగాథం ఆ పార్టీ అగ్రనేతలు ఎన్ని చర్చలు జరిపినా ఫలించే పరిస్థితులు కనిపించడం లేదు.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యే రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కలుపుకుని పోవాలనే ఆలోచన లేనట్టు కనిపిస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేతో కలిసి నడిచేందుకు సుముఖంగా లేరన్నట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో కీలకమైన ఆ ముగ్గురు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఎవరివైపు ఉండాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

అంతర్గత విభేదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ముగ్గురు నాయకులూ ఎవరికి వారుగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో అయోమయం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తే తాను గెలిచినా స్వతంత్రత ఉండదని, సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌రెడ్డి అంతర్ఘతంగా మధనపడుతూ తన ముఖ్య అనుచరుల వద్ద చర్చిస్తున్నట్లు వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. వారిద్దరూ లేకపోయినా ప్రస్తుతం ఉన్న కేడర్‌ పార్టీ అభిమానులే కాబట్టి ఇబ్బందులు ఉండవన్న భావనలో ఎమ్మెల్యే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే, వైసీపీ అగ్రనాయకులు స్వయంగా రంగంలోకి దిగి వీరి మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు కూడా ఉండటం లేదు. 2014 ఎన్నికల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పి.అలేఖ్యను ఎంపిక చేస్తానని ఆమె తండ్రి గ్రంధి యానాదిశెట్టికి మాట ఇచ్చినా ఎన్నికల తర్వాత తనకు స్వతంత్రం లేకపోవడంతో మున్సిపాలిటీని వైసీపీ పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మరలా వారిని కలుపుకుని ఇబ్బందులు ఎందుకు పడాలని భావిస్తున్నట్లు తెలిస్తుంది.

2014 ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి గెలుపు కోసం తమతోపాటు గ్రంధి యానాదిశెట్టి కృషి చేసినా ఈ నాలుగున్నర యేళ్లలో తమను పట్టించుకోలేదని కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదని మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తమను పూర్తిగా విస్మరించిన ప్రతాప్‌కుమార్‌రెడ్డి తిరిగి ఆయన్ను గెలిపిస్తే తమకు సహకరిస్తాడనే నమ్మకం సన్నగిల్లుతుందన్న భావనలో వారు ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో తామిద్దరిలో ఒకరికి టికెట్‌ ఇచ్చినా, ఎమ్మెల్యేను కాదని మరొకరికి టికెట్‌ ఇచ్చినా తాము సహకరిస్తామే తప్ప రామిరెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో సహకరించే పరిస్థితే లేదని మాజీ ఎమ్మెల్యేలు అధిష్ఠానం పంపిన నేతల వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం.

ఒక దశలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని మాట్లాడారంటే ఆయనపై ఎంత కోపం, అసహనం ఉందో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణువర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేకు సహకరిస్తాడరన్న నమ్మకం రాజకీయ వర్గాలలో కనిపించడం లేదు. మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కూడా ప్రతాప్ కుమార్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేపట్టిన అనంతరం తమ నిర్ణయం వెళ్ళడిస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డిలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయం అనంతరం పార్టీలో కొనసాగుతారా..? లేక పార్టీ మారి పోటీ చేస్తారా..? లేక మరో పార్టీలో చేరి వారికి సహకరిస్తారా..? లేదా స్వతంత్రంగా పోటీ చేస్తారా..? అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో వైసీపీ కార్యకర్తల మధ్య అయోమయం నెలకొంది.

leave a reply