రాజీనామా చేసినా.. రెండు రోజుల గడువు..?

వంగవీటి రాధ కుమారుడు, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేరుతున్నారని అడిగిన ప్రశ్నకు రెండు రోజుల గడువు కోరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాధా కోరిన రెండు రోజుల గడువు వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీలో చేరేందుకే రెండు రోజుల గడువు కోరారని ఒక వైపు ప్రచారం జరుగుతుంటే లేదు వైసీపీకి డెడ్ లైన్ అంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు జనసేనలో వెళ్లే అంశంపై చర్చించేందుకే రెండు రోజులు గడువు కోరారని ఇంకోవైపు ప్రచారం జరుగుతుంది.

ఇప్పుడు రాధా రెండు రోజుల గడువు ఎందుకు అన్న అంశం కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే కృష్ణా జిల్లాలో బలమైన రాజకీయ నేత వంగవీటి రాధాకృష్ణ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విజయవాడలో ఆయనకు గట్టిపట్టుంది. అలాంటి వ్యక్తి గత కొంతకాలంగా రాజకీయాల్లో సతమతమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన ఆయన ఆ తర్వాత వరుస ఓటమిపాలయ్యారు.

2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన 2014 ఎన్నికల సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి మరోపార్టీలోకి చేరబోతున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చెయ్యగల వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చెయ్యడంతో ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలుగుదేశం పార్టీలో చేరతారని ఒకవైపు లేదు జనసేనలో చేరతారని మరోవైపు వైసీపీ విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఇస్తే పార్టీలోనే ఉండిపోతారని అందుకే రెండు రోజుల సమయం అని ఇంకోవైపు ఇలా ప్రచారం జరిగిపోతుంది.

వంగవీటి రాధాకృష్ణ ఏపార్టీలో చేరబోతున్నారు…?ఎక్కడ నుంచి పోటీ చెయ్యబోతున్నారు..? అనే ప్రశ్న ఆంధ్ర్పరదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి రాజీనామా చేసిన రాధాకృష్ణ రెండురోజుల్లో తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. 

అయితే వంగవీటి రాధాకృష్ణ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చర్చలు కూడా ముగిసిపోయాయని ప్రచారం. అంతేకాదు రాధాకృష్ణ సైకిలెక్కే ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. జనవరి 24న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే టీడీపీలోని కీలక నేతలు రాధాతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు సైతం రాధాకృష్ణ రాకను స్వాగతిస్తున్నారని ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫర్ పై రాధా రెండు రోజుల గడువు కోరినట్లు తెలుస్తోంది.

రెండురోజుల్లో రంగా రాధ మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అంతా ఒప్పుకుంటే ఈనెల 24 లేదా ఆ తర్వాత పార్టీలో చేరతారని టీడీపీ నేతలకు రాధా చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని అందువల్లే ఎమ్మెల్సీ పదవి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ రెండు రోజుల సమయం వెనుక ఆంతర్యం అదేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆయన అభిమానులు చెప్తున్నారు. తన రాజకీయ శత్రువులు దేవినేని కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదన్న వార్తలు సైతం వెలువడుతున్నాయి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీయే రంగాను చంపించిందన్న ప్రచారం కూడా ఉండటంతో రాధా వెళ్లి ఆ పార్టీలో ఇమడగలరా అన్న వాదన సైతం వినబడుతోంది.

ఇకపోతే రాధా ఇచ్చిన రెండు రోజులు గడువు తనకు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేనని మరో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ నిర్ణయంపై నాలుగు నెలల తొమ్మిది రోజులపాటు వేచి చూసిన రాధాకృష్ణ మరో రెండు రోజులు ఓపిక పట్టాలని చెప్తున్న దాని వెనుక మర్మం అదేనని టాక్.

రెండు రోజుల్లో వైసీపీ నిర్ణయం మార్చుకుని విజయవాడ సెంట్రల్ సీటు రాధాకృష్ణకు ఇస్తే ఆయన వైసీపీలోనే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాధా రాజీనామాపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు స్పందించలేదు.

రాధాను వదులుకోవడం కూడా వైసీపీకి ఇష్టం లేదని తెలుస్తోంది. రాధా పార్టీ వీడిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న వాదనలు కూడా లేకపోలేదు. 

ఇదిలా ఉంటే వంగవీటి రాధా కృష్ణ జనసేన పార్టీలో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కుటుంబం అంటే వంగవీటి రాధాకృష్ణకు ప్రేమ. అందువల్లే 2009లో కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత పీఆర్పీ తరుపున పోటీ చేసి 2009లో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినేట్ లో మంత్రి పదవి పొందేవాడివని పీఆర్పీలో చేరి తప్పు చేశారంటూ ఆయన అభిమానులు సైతం రాధాతో చెప్పినట్లు వార్తలు వినిపించాయి.

ఇప్పుడు ఆయన సోదరుడు పెట్టిన జనసేన పార్టీలో చేరతారా అంటూ సందేహం నెలకొంది. జనసేన పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం ఒంటిరిగానే పోటీ చేస్తామని చెప్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా జనసేనలోకి వెళ్లడం భావ్యమా అన్న చర్చకూడా జరుగుతోంది. అయితే ఏది ఎంతవరకు నిజం..? టీడీపీ కండువా కప్పుకుంటారా..? జనసేన కండువా కప్పుకుంటారా..? వైసీపీ అధిష్టానం దిగివస్తే రాజీనామాను వెనక్కి తీసుకుంటారా..? అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

leave a reply