రికార్డు బ్రేక్ చేసాడు..విమర్శల పాలయ్యాడు..!

క్రికెట్‌లో విజయాలు, రికార్డులనేవి టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికే సాధ్యమని చెప్పుకుంటారు. ప్రపంచంలోని ఏ ఒక్క క్రికెటర్ అందుకోలేని పేరు ప్రఖ్యాతలు సాధించాడు. అయితే కోహ్లికి సంబంధించిన ఓ రికార్డును తాజాగా దక్షిణాప్రికా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ హషిమ్ ఆమ్లా అధిగమించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో శతకం సాధించడంతో కోహ్లిని వెనక్కి నెట్టి రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మార్క్ అందుకున్న ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఇంతకముందు కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకోగా, ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేసి కోహ్లీని అధికమించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది.

ఆమ్లా సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అయితే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ స్కోరును చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఆమ్లా (108;120 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్‌)సాధించినప్పటికీ ఆ జట్టు 300 పరుగుల మార్క్ కూడా అందుకోలేకపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. అయితే చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నప్పటికీ ఆమ్లా ధాటిగా ఆడకుండా సెంచరీ కోసం తాపత్రయపడ్డాడని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆమ్లా తన స్వార్థం పక్కన పెట్టి ఉంటే జట్టు స్కోరు 300 అధికమించేదని, దీనితో దక్షిణాఫ్రికా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండేవని మాజీ ఆటగాళ్లు విమర్శించారు.

leave a reply