రాష్ట్రానికి బాబే బ్రాండ్ అంబాసిడర్ అట..!

నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం దావోస్‌కు వెళుతున్న చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం ఎన్నికలు ఉండటంతో రాష్ట్ర యువమంత్రి నారా లోకేష్‌ను పంపారు. చంద్రబాబు నాయుడు బదులు దావోస్‌కు వెళ్లిన నారా లోకేష్‌కు అనుహ్య పరిణామం ఎదురైంది.  

అయిదు రోజులపాటు దావోస్‌లో పర్యటిస్తున్న లోకేశ్‌ బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటం, ఇప్పటికే దిగ్గజ సంస్థలు కియా, ఇసూజీ, హీరో, అశోక్‌ లేలాండ్ వంటి సంస్థలతో పాటు పలు మొబైల్ కంపెనీలు కూడా పరిశ్రమలు ఏర్పాటుచేశాయి. ఈ అంశాలన్నింటినీ లోకేశ్ బృందం ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు చూపించింది.

 ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన బిజినెస్ మాగ్నట్ లోకేశ్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట.

ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం పోర్టుతో పాటు సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను లోకేష్ బృందానికి వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపడంతో ఆయన మోదీని కలుసుకున్నారట.

సదరు పారిశ్రామికవేత్త వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ… ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ “మీరు గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీనుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది” అని చెప్పారట. అయితే పారిశ్రామిక వెత్త మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ, అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ స్పష్టంచేశారట.

 లోకేశ్‌తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొస్తూ.. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా చెప్పటంతో లోకేష్ అవాక్కయ్యారట. ఏపీలో ఉండే పారిశ్రామిక విధానం, క్లియరెన్స్‌ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్‌లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిన బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్నిచోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకే‌శ్‌కు వివరించారట.

    ఏపీ పట్ల సానుకూలతకి మరో కారణం కూడా పారిశ్రామికవేత్త లోకేశ్‌ బృందానికి చెప్పారట. “చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్” ప్లస్‌పాయింట్‌ అని చెప్పడంతో లోకేశ్ తదితరులు సంతోషంతో పొంగిపోయారట.

తమ నాయకుడి గురించి  తెలిపిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపడంతో పాటు ఆయనకు ఆంధ్రా రుచులను కూడా చూపించగా, రుచికరమైన ఆ విందు ఆరగించిన సదరు పారిశ్రామికవేత్త.. “మీ రాష్ట్రం బాగుంది.. మీ ఆతిథ్యం బాగుందీ.. మీ వంటలు బాగున్నాయి” అంటూ ప్రశంసలు కురిపించారట.

    దావోస్‌లో లోకేశ్ బృందం అయిదురోజుల పర్యటనలో హైలెట్‌గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందట. ఏపీలో అనువైన పరిస్థితులు, సౌకర్యాలపై ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు మాట్లాడుకోవడం తనకు అమితానందం కలిగించిందని సన్నిహితులకు చెబుతున్నారట ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీ మరియు ఐటీ శాఖ మంత్రి.

leave a reply