వేములవాడ ‘రాజరాజేశ్వర స్వామి’

కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. చారిత్రాత్మకంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. చాళుక్యుల కాలం నాటిది ఈ ఆలయం.

స్థల విశిష్టత ప్రకారం.. ఈ దేవాలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట.

చరిత్ర ప్రకారం.. ఈ పురాతన గ్రామం చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు: లక్షల సంఖ్యలో భక్తులు ఈ ఆలయన్ని దర్శించుకుంటారు. శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

leave a reply