హమీద్ కు ఎట్టకేలకు.. విముక్తి!

పాకిస్థాన్ జైలు నుంచి స్వదేశానికి వచ్చిన సాఫ్ట్ వేర్  ఇంజినీరు హమీద్ నిహాల్ అన్సారీ తన తల్లితో సహావిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. పాకిస్థాన్‌లో తాను అనుభవించిన కష్టాలను వివరించారు. హమీద్ తల్లి ఫౌజియా అన్సారీ ఆరేళ్ళ నుంచి క్షణ క్షణం తనకుమారుడిని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. తన కుమారుడు స్వదేశానికి రావడంలో ప్రధాన పాత్ర పోషించిన సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్న ఆనందంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె నోటి నుంచి మాటలు వెలువడలేదు. కన్నీటి పర్యంతమయ్యారు. అందుకే కనీసం థ్యాంక్స్ అన్నమాటలు కూడా ఆమె పలకలేకపోయారు.ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ‘‘మా అమ్మ చాలా గొప్పవారు. నా భారతదేశం చాలాగొప్పది. మా మేడమ్ గొప్పవారు. అంతా అమ్మగారే చేశారు’’ అని చెప్పారు.

హమీద్ కూడా పాకిస్థాన్‌లో తాను ఎదుర్కొన్న దుస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. హమీద్‌కు పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం 2015 డిసెంబరు 15న జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన పెషావర్కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించారు. ఆయన జైలులో ఉన్నపుడు ఆయనతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పాటు చేయాలని పాకిస్థాన్‌ను భారతదేశం కోరింది. 96 లేఖలను రాసింది. అవిశ్రాంతంగా ఒత్తిడి తేవడంతో హమీద్‌ను పాకిస్థాన్ వదిలి పెట్టిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో పరిచయమైన స్నేహితురాలిని కలుసుకునేందుకు హమీద్ 2012లో ప్రయత్నించారు. ఆయన ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తమ దేశంలో అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది.

leave a reply