రాముడు దేవుడే…కాదంటూ!

అయోధ్యలో రామ మందిర నిర్మణం గురించి దేశంలో చర్చ జరుగుతున్న వేళ  కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత కేఎస్ భగవాన్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు “రాముడు అసలు  దేవుడే కాదు.. ఎందుకంటే సాధారణ మానవుల్లాగా రాముడు కూడా చాలా సమస్యలతో సతమతమయ్యాడు’’ అని  తన పుస్తకంలో ప్రస్తావించారు. ఈయన కన్నడలో “రామ మందిర యేకే బేడ” అనే పుస్తకం రాశారు.  మానవులలాగా అనేక కష్టాలు అనుభవించిన  రాముడు దేవుడు ఎలా అవుతాడంటూ తన సందేహాన్ని ఆయన రాసిన ఆ పుస్తకంలో వివరించారు. దీనిపై ఓ హిందుత్వ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు భగవాన్‌పై కేసు నమోదు  చేశారు.

భగవాన్ తన పుస్తకంలో  హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాసినప్పటికీ  ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించకపోవడంపై బీజేపీ మండిపడుతోంది. భగవాన్‌ను అరెస్ట్ చేయడమో, లేదంటే మానసిక ఆసుపత్రికి పంపడమో వంటివి చేయాలని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే  ఎస్‌.సురేశ్‌ కుమార్‌ అన్నారు. ‘రామ మందిర యేకే బేడ’ అనే పేరుతో రాయబడ్డ ఈ పుస్తకం  వివాదాస్పద పుస్తకంగా హిందుత్వ సంస్థలు అభిప్రాయపడుతూ.. భగవాన్‌పై మండిపడ్డాయి. ఆయన రాముడ్ని తక్కువ చేసి లిఖించారని, రాముడు అసలు దేవుడే కాదని అర్థం వచ్చేలా రాసిన ఆయన పుస్తకాన్ని నిషేధించాలని  మైసూరు జిల్లాకు చెందిన హిందూ జాగరణ్‌ వేదిక అధ్యక్షుడు కె.జగదీశ్‌ హెబ్బర్‌ భగవాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

leave a reply