హఠాత్తుగా.. ఎందుకింత చలి…

ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌‌ను చలి చంపేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.తెలంగాణతో పోలిస్తే రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో చలి కాస్త తక్కువగా ఉంది. గత 24 గంటల్లో (19వ తేదీకి) హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా నమోదయింది. ఇంతకీ వణికించే స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోడానికి కారణం ఏంటి? చల్ల గాలులు శీతాకాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణానికి చల్ల గాలులు వీస్తుంటాయి. వాటి వల్ల ఇక్కడ చలి పెరుగుతుంది. ఇలా ప్రతీ ఏటా నాలుగైదుసార్లు జరుగుతుంది. ఆ చల్లగాలుల ప్రభావం ఉన్న రెండు మూడు రోజులు రాత్రి పూట చలి పెరుగుతుంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతం అయి ఉండడం, వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలో మమాలుగా ఈ కాలంలో ఉండేదానికంటే 3-4 డిగ్రీలు పడిపోవడంతో చలి గాలుల తీవ్రత పెరిగింది.వానలు తుపాను ప్రభావంతో తెలంగాణలో చాలా చోట్ల వానలు పడ్డాయి. సహజంగానే వానలు పడ్డచోట్ల వేడి తగ్గుతుంది. దాంతో రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

కమ్ముకున్న మేఘాలు రెండు మూడు రోజులుగా హైదరాబాద్, తెలంగాణలో చాలా చోట్ల ఆకాశంలో సూర్యుడు కనపడలేదు. మొత్తం మేఘాలు కమ్మేశాయి. ఇంత భారీగా మేఘాలు కమ్మడం వల్ల సూర్యకాంతి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు. దీంతో భూమి వాతావరణం వేడెక్కదు. దీంతో చలిగా ఉంటుంది. వర్షం కురిసే ముందు మేఘం పట్టినప్పుడు వచ్చే వాతావరణం ఇక్కడ రెండు రోజులు కొనసాగింది.పైన ఉన్న మూడు కారణాల్లో ఏదో ఒక కారణంతో చలి పెరుగుతుంది.కానీ, ఈ రెండు రోజుల్లో తెలంగాణలో ఈ మూడు కలసి వచ్చాయి.తుపాను ప్రభావంతో వానలు కురుస్తున్న సమయంలోనే ఉత్తరాది నుంచి చల్ల గాలులు వచ్చాయి. దాంతో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చలి పెరిగింది.తుఫాను ప్రభావం తగ్గాక కూడా సూర్యుడు కనిపించి ఉండుంటే ఆ తేడా తెలిసేది కాదు. కానీ దట్టమైన మేఘాలతో ఆ అవకాశం లేకపోయింది.

మూడు కారణాలు కలిసి తెలంగాణలో చలి తీవ్రతను పెంచాయి.శీతాకాలం పగటి ఉష్ణోగ్రతలు పడ్డాయిశీతాకాలంలో రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గడం, పగలు పెరగడం మామూలే. కోస్తాతో పోలిస్తే, రాయలసీమ – తెలంగాణలున్న దక్కన్ పీఠభూమిలో ఈ తేడాలెక్కువ. ఇక్కడ శీతాకాలం పగలు 28 డిగ్రీల వరకూ వేడి నమోదు కావాల్సి ఉంటుంది. కానీ పైన చెప్పిన మూడు కారణాల వల్ల అది 20 డిగ్రీల కంటే తగ్గిపోయింది. పగటి పూట కూడా 19-20 డిగ్రీలు ఉండడం, రాత్రుళ్లు ఇంకా తగ్గడంతో చలి తీవ్రత పెరిగిపోయింది.రికార్డు స్థాయి కాదు మామూలుగా ఎక్కువ వేడి, లేదా చలి లేదా వాన వచ్చినప్పుడు ఇన్నేళ్ల రికార్డు బద్దలయిందని వార్తలు వింటుంటాం. కానీ ప్రస్తుతం ఉన్న చలితో అలాంటిదేమీ జరగలేదు. రాత్రి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడమే దీనికి కారణం. కాకపోతే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం 7 డిగ్రీల వరకూ పడిపోయాయి.18వ తేదీ ఉదయం 8.30 తీసుకున్న రికార్డు ప్రకారం, ఎక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు లేదు.

 కేవలం 1 డిగ్రీ మాత్రమే తేడాలున్నాయి. కానీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి.ఈ సీజన్లో ఉండాల్సిన దానికంటే భద్రాచలంలో 10 డిగ్రీలు, హకీంపేట 7, హనుమకొండ 12, హైదరాబాద్ 8, నిజామాబాద్ 9, రామగుండం 9 డిగ్రీల మేరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు (రాత్రిపూట, తెల్లవారుఝామున) మాత్రం ఎక్కడా 1 డిగ్రీ కంటే పెద్ద మార్పులేదు. అంతేకాదు తెలంగాణ దక్షిణ ప్రాంతంలోని మహబూబ్ నగర్, నల్లగొండల్లో కూడా పెద్దగా ఉష్ణోగ్రతల మార్పు లేదు.”శీతాకాలంలో, ముఖ్యంగా డిసెంబరు చివర్లో జనవరి మొదట్లో ఉదయం పూట వేడి (ఉష్ణోగ్రత) ఉత్తర భారతంలో 12-13 డిగ్రీలు, దక్షిణాన 16 డిగ్రీలు వరకూ ఉండటం సాధారణం. అయితే పగటి పూట కూడా సూర్యకాంతి పడక వేడి పెరగకపోవడం, వానలుతో మనకు మరింత చలి అనిపిస్తోంది” అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ వై కె రెడ్డి చెప్పారు.ఇంకెంత కాలం? ఇప్పుడు తెలంగాణపై తుఫాను ప్రభావం పోయిందనీ, మేఘాలు కూడా తగ్గుతున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. ఈ రోజు హైదారాబాద్ లో సూర్యుడు కనిపించడంతో పగటి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగి 25 డిగ్రీల వరకూ నమోదు కావచ్చన్నారు. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకాస్త పెరుగుతాయని వారు చెప్పారు.

గత 24 గంటల ఉష్ణోగ్రతలు (19వ తేదీ నాటికి)

                        కనిష్టం               గరిష్టం

హైదరాబాద్       14.5                  19.8

రామగుండం      16.6                  22.2

నిజామాబాద్      12.5                 19.9

విజయవాడ        19.3                 25.2

కర్నూలు            19.2                 25.2

అనంతపురం       17.2                 29.3

కళింగపట్నం       17.7                 21.5

leave a reply