ఇదంతా చంద్రబాబు చేసిందే..

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..ముందుగా రాష్ర్ట ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పథకాలను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. అలాగే నిరుద్యోగుల కోసం చంద్రన్న యువనేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.1000 భృతి ఇస్తూ ఆదుకుంటున్నారన్నారు. నూతన సంవత్సరంలో పింఛన్లను రూ.1000 నుంచి రూ.2000 కు పెంచి వృద్ధులను, వితంతు, వికలాంగులకు ఆపన్న హస్తంలా నిలబడ్డారని ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని, ఇదే వేగంతో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి, అన్ని సమస్యలను అధిగమించాలని ఆశిస్తున్నానన్నారు. ఒకపుడు విద్యుత్ సమస్యతో ఉన్న రాష్ర్టం ఇప్పుడు మిగులు రాష్ర్టంగా మారిందంటే..అదంతా చంద్రబాబు కృషి ఫలితమేనన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ..ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను నిర్మించుకుని అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నాలుగేళ్లలో ఇంత గణనీయంగా అభివృద్ధి చెందిన
రాష్ర్టం బహుశా ఆంధ్రప్రదేశ్ మాత్రమే అయి ఉండవచ్చన్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి హైస్పీడ్‌ ఇంటర్నెట్ , ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. మహానగరాలను సుందరమైన నగరాలుగా తీర్చి దిద్దుకుంటున్నామని, ఇదే వేగంతో ఏపీ ముందుకు సాగాలని గవర్నర్ ఆకాంక్షించారు.

leave a reply