చురుగ్గా.. అవ్వాలంటే..

మార్నింగ్‌ వాకింగ్‌, జాగింగ్‌ లేదా యోగా ఆరోగ్యకరమని డాక్టర్స్‌, పెద్దలు అందరూ చెప్తూనే ఉంటారు. దానిని కొంతమంది పాటిస్తారు.. మరికొంత మంది విని వదిలేస్తారు. గర్భిణులకు కూడా వాకింగ్‌ మరింత ఉపయోగపడుతుంది. పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలంటే వాకింగ్‌ కూడా సహకరిస్తుంది. కండరాలు సాగడానికి, రక్తం వేగవంతంగా ప్రసరణ జరగడానికి వాకింగ్‌, జాగింగ్‌ చాలా ఉపయోగపడతాయి. మరి అవి మనకు ఆరోగ్యాన్నిస్తున్నాయి. మరి మనం కూడా వాటికి తగిన రెస్ట్‌ ఇవ్వాలి కదా.. మరి..

ఓ గంటసేపు వ్యాయామం చేశాక త్వరగా ఆకలి వేయకుండా ఉండాలన్నా.. పోషకాలు అందాలన్నా నానబెట్టిన బాదం గింజలు, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిలో విటమిన్‌లు, పోషకాలు చాలా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ బారి నుంచి కాపాడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే యాంటీఆక్సిడెంట్లు అంది శరీరం చురుగ్గా మారుతుంది. అలాగే ఎండుద్రాక్ష, కర్జూరం కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. వీటిలోని పొటాషియం వల్ల శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటుంది. కండరాల నొప్పులు కూడా ఎదురుకావు.

కాగా.. మంచినీళ్లు కూడా శరీరానికి డీహైడ్రేషన్‌ను దూరం చేయడంలో తోడ్పడుతుంది.. అలసట లేకుండా చూస్తుంది. అలాగే.. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తీసుకోవడం మంచిది.

వ్యాయామం తరువాత కండరాలు రెస్ట్‌ పొందాలంటే.. పిండిపదార్థాలు తీసుకోవడమే ఉత్తమం. అలాగని అన్నీ తినేయడం సరికాదు. ఆలస్యంగా జీర్ణం అయ్యే సంక్లిష్ట పిండిపదార్థాలు ఎంచుకోవాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయులు త్వరగా పెరగకుండా ఉంటాయి. ఇందుకు ఓట్స్‌ లాంటి పదార్థాలు బాగా ఉపయోగడతాయి. వీటిలో ఉండే బీటా గ్లూకాన్‌ వల్ల అవి చాలా ఆలస్యంగా అరుగుతాయి. పైగా అలాంటివి కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తాయి.

గంటసేపు వేగంగా వ్యాయామం చేసినప్పుడు కేవలం చెమట మాత్రమే కాదు.. దాని ద్వారా సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్లు కూడా బయటకు పోతాయి. అవి మళ్లీ పొందాలంటే వ్యాయామం చేశాక గ్లాసు టొమాటో రసం తీసుకోవాలి. దీన్నుంచి పొటాషియం, సోడియం లాంటివి శరీరానికి అందుతాయి.

leave a reply