అసెంబ్లీ సాక్షిగా “చంద్రాగ్రహం”

విభజన సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తున్న సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా చండ్రనిప్పులు చెరిగారు. అసెంబ్లీలో చర్చిస్తున్నపప్పుడు రాష్ట్రానికి చెప్పిన దానికంటే ఎక్కువే చేశామంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు  వ్యాఖ్యలు చేయగా ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహావేశానికి గురయ్యారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయమేంటో చెప్పాలంటూ సభలో తెలుగువాళ్లకు పౌరుషం లేదనుకున్నారా? అంటూ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహించారు.

ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర పౌరుడిగా రాష్ట్రం నష్టపోతే ఆవేదన ఉండదా? అని, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎన్ని నిధులిచ్చారో.. వాటిని ఒకసారి ఏపీతో పోల్చి చూడాలని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికోసం నిధులిస్తారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, దిల్లీలో ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఎవరబ్బ సొమ్ము అనుకుంటున్నారు. వినేవాళ్లు ఉంటే మీ ఇష్టప్రకారం మాట్లాడతారు. సాధారణ పౌరుడుకి ఉండే ఆసక్తి.. ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత మీకు లేదు. రక్తం పొంగిపోతోంది. రాష్ట్రంలో ఎవరికి ఊడిగం చేస్తారు? అడిగేవారు లేరనుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేస్తారు? జైల్లో పెడతారా? మీ ఇష్ట ప్రకారం తమాషాలు ఆడుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే సహకరించాల్సింది పోయి సిగ్గు వదిలిపెట్టి మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టమని, బీజేపీ నేతలను తిరగనివ్వమంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి చేశారని, దక్షిణాది నుంచి ప్రస్తుతం ఏ ఒక్కరైనా కేంద్ర మంత్రిగా ఉన్నారా అని, అన్యాయం చేసింది కాక.. తిరిగి తమనే విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దక్షిణాది నుంచి కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడు ఉండేవారని, వీళ్లు కోపంతో ఆయన్ను కూడా తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని చేసేశారని, అది పనిష్మెంటా.. ప్రమోషనా అనేది దేవుడికే తెలియాలని, దేశంలో దక్షిణాది భాగం కాదా? కాంగ్రెస్‌ హయాంలోనూ ఉత్తరాది వారు ప్రధానిగా ఉంటే దక్షిణాది వ్యక్తిని రాష్ట్రపతిగా ఉంచడం వంటివి చేసేవారని, ఈశాన్య రాష్ట్రాలతో సహా సముచిత స్థానం ఇచ్చి గౌరవించేవారని, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయను పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 కర్ణాటక నుంచి ఉన్న అనంతకుమార్‌ మృతిచెందారని, ఒక్క సదానంద గౌడ మాత్రమే మిగిలారని, దక్షిణాదిలో ఎంతమంది మంత్రులకు ఎన్ని ఫోర్ట్‌ ఫోలియోలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండని, మనోభావాలను ఎలా కాపాడతారు? ఉపన్యాసాలు ఎలా ఇస్తారు? దక్షిణాదిలో ఖాతా తెరవలేని మీరు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గెలుస్తాం అని చెబుతారు. ఎలా గెలుస్తారు? అశాస్త్రీయ విభజన జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఇంటింటికీ తిరిగానని, ప్రధాని మోదీ ఎక్కడికొస్తే అక్కడ కలిశానని, న్యాయం చేస్తారనే తిరిగానని, నాకోసం తిరగలేదని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.

leave a reply