తుది నిర్ణయం ఫ్రాంచైజీలదే!

2019 వరల్డ్‌ కప్‌లో పాల్గొనే భారత క్రికెటర్లకు ఐపీఎల్‌ నుంచి విశ్రాంతి ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాకాలం నుంచి వినిపిస్తుంది. అయితే బీసీసీఐ నుంచి ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ అంశంపై బోర్డు పెదవి విప్పింది. మార్చి 23న ప్రారంభం అవుతూ ఐపీఎల్‌ మే 12న ముగియనుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే మే30వ తేదీన ఇంగ్లండ్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో ప్రపంచక్‌పలో ఆడే క్రికెటర్లపై  ఒత్తిడి పడకుండా చూడాలని, అలాగే  ఫిట్ నెస్ కోల్పోకుండా వారికి తగిన సమయం కేటాయించాలని  ఫ్రాంచైజీలను కోరనున్నట్టు బోర్డు వెల్లడించింది.

ఆటగాళ్లను ఎన్ని మ్యాచ్‌లు ఆడించాలి. ఎన్నింటికి విశ్రాంతి ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆ విషయాలను వెల్లడిస్తామని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపాడు. ప్రధానంగా వరల్డ్‌కప్‌కు వెళ్లే 18 మంది భారత ఆటగాళ్లను షార్ట్‌ లిస్ట్‌ చేశామని, వీరిని సాధ్యమైనన్ని తక్కువగా ఐపీఎల్‌ ఆడించాలన్నదే తమ ప్రతిపాదనగా చెప్పాడు.

అయితే స్టార్‌ క్రికెటర్లను ఐపీఎల్‌ ప్రాంచైజీలు దూరంగా పెట్టడం అనుకున్నంత తేలిక కాదని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌధురి తెలియచేసాడు. దీనిపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాయో లేదో చూడాలన్నారు. కానీ క్రికెట్‌ అభివృద్ధి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజీలు సానుకూలంగా స్పందించాలని ఆశాభావం వ్యక్తం చేసాడు.

leave a reply