అందరి దృష్టి మంత్రి వర్గ విస్తరణపైనే..

కేసీఆర్ చేపట్టిన చండీయాగం ముగిసింది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతల దృష్టి అంతా మంత్రి వర్గ విస్తరణపైనే పడింది. ఈ మంత్రి వర్గ విస్తరణ ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా..ఈ సారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి స్థానం దక్కుతుందో…ఎవరు ఉన్న పదవిని కోల్పోవాల్సి వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ ను ఈ సారి మంత్రి పదవి వరించడం కష్టమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హరీష్ రావుకు కూడా మంత్రి వర్గ విస్తరణలో స్థానం లేనందు వల్లే..ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ పూర్తి స్థాయిలో కాకుండా పరిమిత సంఖ్యలోనే జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ప్రస్తుతం పరిమిత సంఖ్యలో అంటే..6 లేదా 8 మంది వరకూ మంత్రి వర్గ విస్తరణ చేసి, ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరనుంది. నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో మంత్రి వర్గ విస్తరణ అనంతరం రెండు లేదా మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దానికన్నా ముందే జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అన్నీ ఇలా వరుసపెట్టి వస్తుండటంతో సీఎం కేసీఆర్ రాజకీయ సంబంధాలు, రాష్ర్టంలో పాలనాతీరుపై దృష్టిసారించనున్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక మూడో విడత ఎన్నికలు జనవరి 30వ తేదీన జరగనున్నాయి.

leave a reply