‘అన్న’వరం శ్రీ సత్యనారాయణ స్వామి

అన్నవరం సత్యనారాయణ స్వామి ఈ స్వామినే సత్య దేవుడు అని కూడా పిలుస్తూంటారు. భారతదేశంలోనే ఈ ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా చెబుతూంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ప్రాంతంలో రత్నగిరి పర్వతంపై ఈ క్షేత్రం అలరారుతుంది. అన్నట్టుగానే అన్ని వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి ఈ ఆలయానికి ‘అన్నవరం’గా పేరొచ్చింది. సత్యానికి సాక్ష్యంగా ఈ దేవుడు నిలుస్తాడు కాబట్టి ‘వీర వెంకట సత్యనారాయణ స్వామి’గా భక్తులు కొలుస్తూంటారు. దీనికి నిదర్శనంగా ఎన్నో కథలు కూడా మనకు వినిపిస్తూంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన జంటగాని లేదా కొత్తగా కట్టుకున్న ఇంటిలో కానీ చేయిస్తూంటారు.

చరిత్ర ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సుమారు 15 కి.మీ.ల దూరంలోని రత్నగిరి పర్వతంపై 1891-ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స దివాణం జమీందార్‌ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీసత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. వెంకట రామరాయలు స్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు కనుక ‘వీర వెంకట సత్యనారాయణ స్వామి’గా పేరొచ్చిందని కూడా చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాజా తమ గ్రామపెద్దలకు వివరించగా.. అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీసత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధానాలయం నిర్మించారు. మరోసారి జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు ఏమనగా.. ప్రతీ సంవత్సరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తూంటారు. బ్రహ్మోత్సవాలు, పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాదికి పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరుపుతూంటారు. అలాగే.. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే.

leave a reply