ఆర్ధిక నగరం చేసింది నేనే.. దానికి కేసీఆర్‌ సాక్ష్యం..!

పెద్ద, చిన్న మోదీలను చూసి జనం భయపడుతున్నారన్న బాబు

హైదరాబాద్‌: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనను విమర్శించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ తనను ఎందుకు విమర్శిస్తున్నారో చెప్పాలని, హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించినందుకా? సైబరాబాద్ కట్టినందుకా? అని ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్‌ను తాను కట్టానని ఎక్కడా చెప్పుకోలేదని, దాన్ని కులీకుతుబ్‌ షా కట్టించారని, సైబరాబాద్‌లాంటి ఆర్థిక నగరాన్ని మాత్రం తానే నిర్మించానని, 20 ఏళ్లలో నగరం ఎంతో పెరిగిందని, ఇంత పెద్ద అభివృద్ధి సాధించగలిగామంటే అదే తెలుగుదేశం పార్టీకి ఉన్న విజన్‌ అని చెప్పారు. నగరంలో గచ్చిబౌలి స్టేడియంతో పాటు ఉర్దూ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌.. ఇలా ఎక్కడా లేనన్ని ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఇవన్నీ ఎవరు అభివృద్ధి చేశారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.

సైబరాబాద్‌ తన మానసిక పుత్రిక అని, ఈ నగరాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్‌ కూడా తనతో ఉన్నారని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న తెలుగుదేశం తెలంగాణలో ఎందుకు అంటూ కేసీఆర్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెదేపా లేకపోతే కేసీఆర్‌ ఎక్కడ? అని, టీడీపీలో పుట్టి.. పైకొచ్చి చివరకు ఆ పార్టీపైనే విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయమని, తన కంటే కేసీఆర్‌కు పరిపక్వత ఉందంటూ మోదీ అన్నారని, జగడాలు పెట్టడంలో మోదీ చాలా తెలివైనవారని ఎద్దేవా చేశారు.

37 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో పోరాడిన తెలుగుదేశం దేశ పరిరక్షణ కోసమే కలిశామని, ఇదో చారిత్రక కలయిక అని, దేశంకోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే తాము కలిశామన్నారు. 40 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తినని, ఇలాంటి పరిస్థితుల్లో తాను మౌనంగా ఉంటే చరిత్ర తనను క్షమించదని, అందుకే అన్నిపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

కేంద్రం అన్యాయం చేస్తే ఎదిరించిన పార్టీ కాబట్టే దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశామని, ఎవరు ఫోన్లలో మాట్లాడాలన్నా భయపడుతున్నారని, మీడియా పేపర్లో రాయాలన్నా కేంద్రంలో పెద్ద మోదీ, తెలంగాణలో చిన్న మోదీని చూసి భయపడుతున్నారని చెప్పారు. మోదీ దేశాన్ని దగా చేస్తే.. కేసీఆర్‌ రాష్ట్రాన్ని దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలంగాణలో నీటికి తాను అడ్డం పడలేదని, తన హయాంలో మాధవరెడ్డి లిఫ్ట్‌ కెనాల్‌, దేవాదుల, కల్వకుర్తి, భీమ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఒక ఆర్థిక నగరాన్ని నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిన తనపై విమర్శలా? అని, నేడు సైబరాబాద్‌ నగర పరిధిలో ఉన్న భవంతులు కనీసం రోడ్లు కూడా వేయలేకపోయిన కేసీఆర్‌ కట్టారా? అని, విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రైతులకు రూ.1.5లక్షల రుణమాఫీ చేస్తే కేసీఆర్‌ చేసింది కేవలం రూ.లక్షేనని, 13 మంది పోటీచేసిన తెదేపా చేతిలో తెలంగాణ రిమోట్‌ కంట్రోల్‌ ఉంటుందా? అని ప్రశ్నించారు.

Live from the Road show, Allwyn X Road, Telangana

Posted by Nara Chandrababu Naidu on Thursday, November 29, 2018

leave a reply