ప్రశంసలు తప్పా.. పైసా రాలేదు

శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం నుంచి పొగడ్తలే తప్ప.. పైసా రావట్లేదని ఆరోపణలు చేశారు. విభజన హామీలు కూడా అమలు చేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్ర కార్యక్రమాలను ప్రశంసిస్తూనే.. వెనక నుంచి గోతులు తవ్వుతున్నారు. ప్రజలు నిజాన్ని నమ్మారు కాబట్టే తెలంగాణలో మళ్లీ కేసీఆర్‌ పాలన వచ్చింది. ఎన్నిసార్లు.. రకరకాలుగా విజ్ఞప్తులు చేస్తున్నా.. బండరాయిలా అస్సలు కరగడం లేదన్నారు.

మిషన్‌ భగీరథకు కేంద్రం అవార్డు లభించింది. మిషన్‌ భగీరథకు రూ.19 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్‌ చెప్పింది. అవార్డులు.. తప్ప నిధులు ఇవ్వకపోవడం విచారకరం. తెలంగాణాలో బీజేపీ ఉనికి లేదనే అక్కసుతో కేంద్రం వివక్ష చూపుతోంది. కేంద్ర వైఖరిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులిస్తోంది. ప్రతిపక్ష రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోంది. అన్ని రాష్ట్రాలనూ ఒకేలా చూడాలన్న ఇంగితాన్ని కేంద్రం మరిచింది.

నీతి అయోగ్‌ సిఫార్సు చేసినా.. కేంద్రం తిరస్కరించింది. అందుకే బీజేపీని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో తిరస్కరించారు. అయినా కూడా.. బీజేపీ ఇదేవిధమైన పక్షపాతం చూపిస్తే.. రేపు.. పార్లమెంట్‌ 17 ఎంపీ సీట్లతో కూడా బీజేపీకి డిపాజిట్లు దక్కవు. జాతీయ ప్రాజెక్టుల విషయంలోనూ అన్యాయమే చేస్తోంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఈఆర్‌ విషయంలోనూ నిర్లక్ష్యమే చూపుతున్నారు. గతంలో బీజేపీకి లోక్‌సభలో ఒక్క సీటే వచ్చింది.. అసెంబ్లీలో ఐదు నుంచి ఒకటికి పడిపోయింది. ఇలాగే దారుణమైన ప్రవర్తన చూపితే.. అది కూడా రాదని కేటీఆర్‌ విమర్శించారు.

leave a reply