ఆసీస్ ధాటికి… శ్రీలంక వైట్‌వాష్‌!

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయవంతంగా క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా శ్రీలంకపై  366 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 319 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. ఫాలో ఆన్‌ ఆడించకుండా, రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆ జట్టు 196/3  పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది.

516 పరుగుల భారీ విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐదు వికెట్లతో చెలరేగిపోవడంతో లంకేయులు ఓటమి చవిచూశారు. మిచెల్‌కు జతగా ప్యాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లతో మెరిశాడు. శ్రీలంక బ్యాట్స్ మెన్ కుశాల్‌ మెండిస్‌(42), లహిరు తిరుమన్నే(30)లు మాత‍్రమే ఫరవాలేదనిపించగా… మిగిలిన బ్యాట్స్ మెన్ రాణించలేకపోవడంతో శ్రీలంకకు ఘోర ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం స్టార్క్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. దాంతో ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లను స్టార్క్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

leave a reply