ఇంద్ర‌కీలాద్రిపై 22న క‌ల‌శజ్యోతి మ‌హోత్స‌వం

విజయవాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 22న క‌ల‌శ‌జ్యోతి మ‌హోత్స‌వాన్ని నేత్ర‌ప‌ర్వంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన‌ట్లు ఆల‌య ఈవో కోటేశ్వ‌ర‌మ్మ తెలిపారు. పురాణాలు, వేదాల్లో చెప్పబడినట్లు జ్యోతి స్వరూపముగా శ్రీ అమ్మవారిని ఆరాధించుట, వేదాలలో అగ్ని ముఖంగా దేవతలను ఆరాధించమని చెప్పబడిద‌న్నారు. శ్రీ భవానీ యొక్క నామమును స్మరిస్తూ యావ‌న్మంది భవానీలు కలశజ్యోతులతో ఇంద్రకీలాద్రి కొండ మీదకు చేరుకొంటార‌ని తెలిపారు.

కాగా.. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల‌కు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు గొప్ప వైభవంగా భవానీ భక్తకోటి సముదాయంతో జై భవానీ, జై జై భవానీ శరణ ఘోషతో శ్రీ శివరామనామాకృష్ణక్షేత్రం, సత్యనారాయణపురం, విజయవాడ నుండి ప్రత్యేక రధంలో శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారు కొలువై ఉండగా కలశజ్యోతి మహోత్సములతో గొప్ప ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి సన్నిధికి చేరుతుంద‌న్నారు. దేవస్ధాన ఘాట్ రోడ్డు మార్గం ద్వారా కలశజ్యోతులను కొండపైకి అనుమతిస్తార‌ని తెలిపారు. అనంత‌రం దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే ఊరేగింపుకు రూటును కూడా నిర్దేశించిన‌ట్లు తెలిపారు. శ్రీశివరామనామకృష్ణక్షేత్రం, సత్యనారాయణపురం, బీఆర్టీఎస్ రోడ్డు, జింఖనా క్ల‌బ్, పాత ప్రభుత్వ ఆసుపత్రి, ఏలూరు రోడ్డు, కంట్రోలు రూమ్‌, వినాయక గుడి, రధం సెంటర్, దేవస్ధాన ఘాట్ రోడ్డు మార్గాల ద్వారా కలశజ్యోతులు చేరుతాయ‌న్నారు.

leave a reply