బాబు బాటలో.. సిక్కోలు చిన్నోడు..

ఢిల్లి పార్లమెంట్‌లో పాత విషయాలైనా.. రోజురోజుకూ కొత్తకొత్త సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ ఏపీ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. ఏపీ పట్ల కేంద్ర నిర్లక్ష్య వైఖరిని ఎంతగా ఎండగడుతున్నా.. కేంద్రం మాత్రం ఏ.. మాత్రం స్పందించటం లేదు. చేసుకుంటే చేసుకోండని వాయిదాల మీదనే సభను నడిపిస్తున్నారు తప్ప చివరిగా ఏం చేస్తామనేది స్పందించడంలేదు.

ఇక.. పార్లమెంట్‌ ఆవరణలో చేపట్టిన నిరాహార దీక్షను ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, మురళీ మోహన్‌‌ విరమించారు. ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రామ్మోహన్‌ నాయుడు తన పుట్టిన రోజున నిరాహార దీక్ష చేపట్టగా.. ఆయనకు మద్దతుగా మురళీమోహన్‌ నిరాహార దీక్షలో కూర్చొన్నారు. విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్‌ గజపతిరాజు వారిద్దరికీ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

కాగా.. మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్‌.. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం తాము సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నామని, అందులో భాగంగానే ఈరోజు తన పుట్టిన రోజున వినూత్నంగా చేయాలనే ఆలోచనతోనే చంద్రబాబు స్ఫూర్తితో పార్లమెంట్‌ సాక్షిగా పోరాడాలనే నిరాహార దీక్షకు దిగానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన న్యాయంపై అనేక విధాలుగా తాము కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో అనేక విధాలుగా పోరాటాలు కొనసాగించామన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగడమే తమ అంతిమ లక్ష్యమని ఏపీ ఎంపీలు నిరసన తెలిపారు.

leave a reply