కన్నీటితో కెమెరా.. బాధను పంటిబిగువన

గత రెండు రోజులుగా కేరళ అట్టుడికిపోతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారలేదు. మహిళల గర్భగుడి ప్రవేశానికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం నుంచే కేరళలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గురువారం నాటి బంద్‌తో అది హింసాత్మకమైంది.

బంద్ పేరుతో ఆందోళనకారులు దుకాణాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రోడ్లపై హంగామా చేశారు. అక్కడితో ఆగక జర్నలిస్టులపై దాడికి దిగారు. పాత్రికేయులపై బుధవారం సాయంత్రం నుంచే జరుగుతున్న దాడులు గురువారం కూడా కొనసాగాయి. బంద్‌ను కవర్ చేసేందుకు వచ్చిన పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులపై అల్లరిమూక దాడులకు పాల్పడింది. మహిళా రిపోర్టర్లను కూడా వదలకుండా యథేచ్ఛగా దాడులకు దిగారు.

బాధను పంటిబిగువన పట్టి కన్నీటితో కెమెరా పట్టుకున్న ఈ మహిళను చూశారా..? శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన ఎంతటి ఉద్రిక్తతలకు దారితీసిందో చెప్పేందుకు నిదర్శనం ఇది. ఓవైపు నిరసనకారులు ఆమెపై దాడి చేస్తున్నా.. కర్తవ్య నిర్వహణకే తలగ్గొంది. గాయాల బాధను దిగమింగి ఆందోళనలను తన కెమెరాతో షూట్‌ చేసింది. ఆమె పేరు షాజిలా అబ్దుల్‌రెహమాన్‌. కైరాలీ టీవీలో కెమెరాపర్సన్‌గా పనిచేస్తున్నారు. తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలను కవర్‌ చేసేందుకు షాజిలా తన బృందంతో వెళ్లారు. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు మీడియా వ్యక్తులపై దాడికి దిగారు. షాజిలాపై కూడా దాడి చేశారు. ఆమె కెమెరా లాక్కొని, నెట్టేశారు. అయినాప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు.

leave a reply