కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్!

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆట రెండోరోజు చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 126 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ఇప్పటికే 170 పరుగుల ఆధిక్యంతో ఉంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్‌ స్టెయిన్‌ అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు.

శ్రీలంకతో తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ ఫీట్ సాధించాడు. అంతేకాకుండా నాలుగు ప్రధాన వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బ తీసాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో 437వ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని చేరాడు. దీనితో భారత దిగ్గజ బౌలర్‌ కపిల్‌దేవ్‌(434 వికెట్లు)ను అధికమించాడు.

స్టెయిన్ తన కెరీర్‌లో 92వ టెస్టు మ్యాచ్‌ ఆడుతూ.. 26సార్లు ఐదు వికెట్లను పడగొట్టడం విశేషం. కాగా, టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన వారిలో ముత్తయ్య మురళీ ధరన్‌(800వికెట్లు) తొలి స్థానంలో ఉండగా, షేన్‌ వార్న్‌(708) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తరువాతి స్థానాలలో అనిల్‌ కుంబ్లే(619), జేమ్స్‌ అండర్సన్‌(575), మెక్‌గ్రాత్‌(563), కర్ట్నీ వాల్ష్‌(516)వికెట్లతో ఉన్నారు.

leave a reply