కాంగ్రెస్ అయిపోయింది.. టిడిపి పరిస్థితి

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇత‌ర పార్టీల నేత‌లు టిఆర్‌య‌స్ నేత‌ల ఆప‌రేష‌న్ ఆకర్ష్ కు త‌లొగ్గుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అధికారికంగా త‌మ పార్టీని టిఆర్‌య‌స్ లెజిస్లేచ‌ర్ లో విలీనం చేయ‌మ‌ని లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్‌య‌స్ లో చేరుతున్నార‌ని ఒక వైపు ప్ర‌చారం జ‌రుగుతుండగానే.. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేల్లో అంత‌ర్మ‌ధ‌నం మొద‌లైంది. టిడిపి నుండి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీని వీడి టిఆర్‌య‌స్‌లో చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. దీని పై మంత‌నాలు సాగుతున్నాయి..

తెరాసా ఆహ్వానిస్తోంది..ఏం చేద్దాం.. తెలంగాణ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు మాత్ర‌మే టిడిపి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ ఇద్ద‌రూ ఇంకా ప్ర‌మాణ స్వీకారం సైతం చేయ‌లేదు. దీనికి ముందే వారు టిడిపి ని వీడి టిఆర్‌య‌స్ లో చేరుతార‌ని ప్రచారం. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే గా ఎన్నికై సండ్ర వెంక‌ట వీర‌య్య నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ నేత‌ల‌తో దాదాపు రెండు గంట‌ల‌కు పైగా మంత‌నాలు సాగించారు. తెరాస నుంచి వచ్చిన ఆహ్వానం గురించి ముఖ్య నాయకులకు వివరించారు.

అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులతోపాటు ముఖ్య నేతల మనోభావాలను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారడం సమంజసమేనని వారు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. టిఆర్‌య‌స్ కు చెంద‌ని ఓ రాజ్య‌స‌భ స‌భ్యుడు ఈ వ్య‌వ‌హారానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు ఎమ్మెల్యేల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ఇంట్లో కలుసుకుని మంతనాలు సాగించారు. తనకు తెరాస అధిష్ఠానంలోని ఒకరి నుంచి పిలుపు వచ్చిందని.. ఇద్దరం కలిసి పార్టీ మారుదామని సండ్ర సూచించినట్లు సమాచారం.

సండ్రతో మాట్లాడిన తర్వాత మెచ్చా నాగేశ్వరరావు మౌనంగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇదే స‌మ‌యంలో తాను తెదేపాను వీడడంలేదని తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బ‌య‌ట‌కు చెబుతున్నారు.తాను టిడిపి ని వీడుతున్నట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌న్నీ వదంతులేనంటూ కొట్టి పారేశారు. కానీ, నాగేశ్వ‌ర‌రావు మాత్రం ఉన్న విష‌యాన్ని చెప్పేసారు. తాను సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుకుందాం రమ్మంటూ తనను ఖమ్మం ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిన మాట నిజమేనని మెచ్చా నాగేశ్వరరావు చెప్పారు. పార్టీ ఫిరాయింపు విషయమై సండ్ర తనతో చర్చించారని.. అయితే తనకు తెదేపాను వీడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఇద్ద‌రు నేత‌లు టిడిపిని వీడితే..ఇక తెలంగాణ‌లో టిడిపి ప్రాతినిధ్యం లేన‌ట్లే…

leave a reply