బావాబామ్మర్ధులవి నటకాలు మాత్రమే..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వబోతున్నారు. కేసీఆర్ పాలనంతా వైఫల్యాల మయం. కేసీఆర్ పరిపాలనను గాలికొదిలేశారు. కేసీఆర్ హయాంలో సచివాలయం కోమాలోకి వెళ్లింది. కేసీఆర్ అసమర్ద పాలనతో ప్రజలల్లో అసహనం పెరిగింది. ఆ అసహనం కసిగా మారింది. కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు మోసాలను, ఆధిపత్యాన్ని  సహించరు. రైతు బంధు పథకం వల్ల బడా భూస్వాములకే లబ్ధి జరిగింది. కేసీఆర్ తన ధన దాహంతోనే రెండు లక్షల కోట్ల కొత్త ప్రాజెక్ట్స్ టెండర్లు పిలిచాడు. రాష్ట్రంలో కాంగ్రెస్,టీడీపీ ల కలయికను ప్రజలు ఆమోదించారంటేనే కేసీఆర్ పట్ల ఎంత రగిలిపోతున్నారో అర్థమౌతుంది. ఈ ఎన్నికల్లో ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం కనిపిస్తుంది. ఉద్యమ సమయంలో ఇతర పార్టీలకు ఎదురైన పరిస్థితి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురు కాబోతోంది. ఈ సునామిలో టిఆర్ఎస్  భూ స్థాపితమౌతుందన్నారు రేవంత్ రెడ్డి.

ఈ ఎన్నికల్లో ప్రజలకు కేసీఆర్ కు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు .. కేటీఆర్ అమెరికా కు .. ఇక హరీష్ రావు కల నెరవేరబోతుంది. హరీష్ ఇప్పుడు నీ వంకర బుద్ది మానుకొని .. మీ పార్టీ కి వచ్చిన సీట్లతో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచెయ్యి. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ తన విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన పిలుపుకు రాష్ట్రంలో ముస్లిమ్స్ సానుకూలంగా స్పందించలేదు.

అసదుద్దీన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అండగా ముస్లింలు నిలబడ్డారు. అసదుద్దీన్ కేసీఆర్ కు మద్దతు ఇచ్చాడని ఆయనపై మేము కక్షసాధింపుకు పాల్పడం. ఒవైసీ సోదరులు తమ నిర్ణయంపై ఇప్పటికైనా సమీక్షించుకోవాలి. కేటిఆర్ హరిష్ లవి సురభి నాటకాలు. వాటిని ప్రజలు నమ్మరు.

ఎన్నికలలో ఎన్ని ప్రలోభాలు పెట్టాలని చూసిన ప్రజలు వాటికి లొంగలేదు. ప్రజలు న్యాయం ఎక్కడ ఉందో అక్కడే ఓటు వేశారు. కుటుంబ పాలనకు చరమ గీతం పాడే రోజు వచ్చింది. కేసీఆర్ గద్దె దిగి మూట ముల్ల సర్దుకొని పోవాలి. కేసీఆర్ అహంకారంతో దుర్మార్గపు పాలన చేశాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఆయన  రాజులా విర్రవీగాడు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అర చేతిలో వైకుంఠాన్ని చూపించాడు.

తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేయలేదు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగను అని చెప్పి 9 నెలల ముందే తన గొయ్యి తానే తవ్వుకుండు . చంద్ర శేఖర్ రావు పీడ తెలంగాణ ప్రజలకు తొమ్మిది నెలల ముందే విరగడమైంది. మహాకూటమికి మద్దతిచ్చిన ప్రజలందరికి ధన్యవాదాలు. 11 వ తారీఖు నాడు కాంగ్రెస్ గెలిచి 12 వ తేది నాడు ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తుంది.” అని రేవంత్ రెడ్డి అన్నారు.

leave a reply