మోదీ – కేసీఆర్ భేటీపై..తీవ్ర ఆసక్తి!

మోదీ – కేసీఆర్ భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. బుధవారం ప్రధాని మోదీతో భేటీ అవడంపై  సీఎం చంద్రబాబు స్పందించారు. నేషనల్ ఫ్రంట్‌ అంటూ పర్యటనలు చేస్తున్నసీఎం  కేసీఆర్‌ ప్రధానిని కలవడంలో అర్థమేంటన్నారు. ప్రధాన మంత్రిని మోదీ  కలిసి రాష్ట్ర సమస్యలు వివరిస్తారా…లేక  బ్రీఫింగ్‌ చేయడానికి వెళ్ళారా అని కేసీఆర్‌ను చంద్రబాబు విమర్శించారు. ఏదైనా ఒక మాట చెప్పడం వేరని, చేసే పనులు వేరేగా ఉంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని, దీనికోసం భాజపా, కాంగ్రెసేతర పక్షాలు ఏకం కావాలంటూ కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల నేతలను కలుస్తున్నారు. ఇటీవల ఒడిశా, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రులు నవీన్‌పట్నాయక్‌, మమతా బెనర్జీతో భేటీ అయి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. మరోవైపు కేంద్రంలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ఇతర పార్టీల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు.

leave a reply