పదవి ప్రజాసేవ చేయడానికే..!

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు వేదికగా ఎన్నికల శంఖారావం మొదలుపెట్టారు. సీఎంగా అవకాశం ఎప్పుడు ప్రజలు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నానని ప్రజలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసగించారు. సీఎం పదవి అనేది తనకు అధికారం కోసం కాదని, సేవ చేయడానికి మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాలు మార్చాలని చాలా దశాబ్దాలుగా తాను ఆలోచిస్తున్నానని, నిజమైన సేవ చేయడానికి అవకాశం కోరుతున్నా నని, తన తుది శ్వాస వరకూ ప్రజాసేవకే అంకితమవుతానని, సినిమా చేస్తున్న సమయంలో జీవితాంతం సినిమాలు చేస్తూ బతకాలా అని అనిపించేదని.. అణగారిన వర్గాలు, ఆడపడుచులకు అండగా ఉండకపోతే జీవితం వ్యర్థం అనిపించి పార్టీ పెట్టానన్నారు. మీ ప్రేమాభిమానాలకు మించి నాకేం అవసరం లేదని జనసేన అధినేత స్పష్టం చేశారు.

శంకారావం సందర్భంగా పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో కొన్ని సమర్థించాల్సిన పరిస్థితులు,మరోసారి వ్యతిరేకించాల్సిన పరిస్థితులు ఉంటాయని ముఖ్యమంత్రికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇద్దరూ కలిసిపోయారంటారని వ్యాఖ్యానించారు. చాలా బలమైన వ్యక్తిని, నన్ను ఎవరూ మార్చలేరని పవన్ స్పష్టం చేశారు.

తాను ఏం చేసినా ప్రజలకు చెప్పే చేస్తానని, ఏ పార్టీతో కలిసినా ప్రజలకు చెప్పే కలుస్తాననన్నారు. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, తనలాంటి వారు వెనుకడుగు వేయకూడదని పవన్ వ్యాఖ్యానించారు.

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదాన్ని మరొకసారి ఎత్తిన జనసేనాని, ప్రజల కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధమని అందకోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడనని తెలిపారు. జగన్ వచ్చి 30 ఏళ్లు ఉంటానంటే కుదరదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, ఐదేళ్లయినా సంపూర్ణ రాజధాని నిర్మించలేకపోయారని మండి పడ్డారు.

జనసేన ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా జనం అభిమానం సంపాదించుకుందని, కోరికలు ఉంటే పదవులు అడిగేవాడినని, కానీ, ఏ రోజూ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని స్పష్టం చేశారు. సమస్య వచ్చే కొద్దీ బలపడతామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, వ్యవస్థను మార్చడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? అని జనసైనికులకు పిలుపునిచ్చారు.

leave a reply