పెంచుకోవాలనే…ఆశతో!

రెండు రోజుల ఉత్కంఠకు దారి తీసిన తిరుమలలో బాలుడి అపహరణ కేసు సుఖాంతమైంది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని  వివరాలను ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వివరించారు. కిడ్నాపర్‌ విశ్వంభర్‌ నిజామాబాద్‌లో  కూలీ పనులు చేసుకునేవాడు. గతంలో కూడా కొన్ని  చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. అయితే బాలుడిని పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే అతను ఈ పనికి పాల్పడ్డానని చెప్పాడు. నిందితున్ని పట్టుకునేందుకు 6 ప్రత్యేకబృందాలు ఎంతో కృషి చేశాయన్నారు .  డిసెంబర్‌ 28న ఉదయం తిరుమలలో బాలుడు వీరేశ్‌ను అపహరించి, అనంతరం బాలునితో మహారాష్ట్రలోని మాహూరుకు నిందితుడు వెళ్లడం జరిగింది.  

సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు వెళ్లిన మార్గాన్ని పోలీసులు తెలుసుకున్నారు. అంతేకాక బాలుడి ఫొటోతో పాటు కిడ్నాప్‌ చేసిన వ్యక్తి చిత్రాలున్న పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి బస్సుల్లో అతికించారు.  అక్కడి స్థానికులు గుర్తుపట్టి సమాచారం ఇవ్వడంతో మాహూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. బాలుని ఆచూకీ కనుగొనడంలో తిరుపతి అర్బన్‌ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు సమష్టిగా కృషి చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.  ఈ కేసులో నిందితుడిని తిరుపతి అర్బన్‌ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

leave a reply