భక్తులు కాదు.. వాళ్లే.. చేస్తున్నారు

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కావాలనే ఆందోళనలకు దిగుతూ శబరిమలను రణరంగంగా మారుస్తున్నాయని కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ఆరోపించారు. గురువారం అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు చేపట్టిన బంద్‌ ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా సీఎం పినరయి మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన అయ్యప్ప భక్తుల కంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మహిళల ప్రవేశంను అడ్డుకుంటూ భక్తులను రెచ్చగొడుతున్నారని అన్నారు.  శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారని హిందూ సంఘాలు హర్తాళ్‌ చేపట్టాయి. దీని అర్థం సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్లే. శబరిమలకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. మా బాధ్యతను మేం నిర్వర్తించాం. శబరిమల వెళ్లేందుకు తమకు భద్రత కావాలని ఆ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. సుప్రీం తీర్పు మేరకు పోలీసులు భద్రత కల్పించారు. ఇతర భక్తుల్లాగే మహిళలు కూడా కాలినడకన వెళ్లారు. మార్గమధ్యంలో అయ్యప్ప భక్తులు వీరికి సాయం చేశారు. ఎవరూ అడ్డుకోలేదు. కానీ ఎప్పుడైతే వార్త మీడియాలో వచ్చిందో అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయని విజయన్‌ తెలిపారు.

బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 50ఏళ్ల లోపు మహిళలు బుధవారం తెల్లవారుజామున శబరిమలను దర్శించుకున్నారు. దీంతో ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేపట్టారు. అయితే మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు నిన్నటి నుంచి ఆందోళనలకు దిగాయి. గురువారం బంద్‌ చేపట్టాయి.

కాగా.. హిందూ సంఘాల కార్యకర్తలు పలు చోట్ల విధ్వంసం సృష్టించారు. 7 పోలీసు వాహనాలు, 79 ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేశారు. 39 మంది పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. బాధితుల్లో చాలా మంది మహిళలే. మహిళా జర్నలిస్టులపై కూడా దాడి చేశారు’’ అని విజయన్‌ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయన్‌ హెచ్చరించారు.

leave a reply