మోడీ ఏ మొహం పెట్టుకుని వస్తావ్..?

ఫిబ్రవరి నెల ఆఖరులోపే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థులతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందన్నారు.

శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన రఘువీరారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థల రక్షణ, నిత్యవసర వస్తువుల ధరల, యువత, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

రాఫెల్‌ కుంభకోణం, పెట్రోల్‌ డీజిల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభిస్తామని రఘువీరారెడ్డి చెప్పారు.

ఈ యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని స్పష్టం చేశారు. మరోవైపు  ఏపీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ఏ మోహం పెట్టుకుని ఏపీకి వస్తారని ప్రశ్నించారు. ఏపీకి మోడీ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.

మోడీ పర్యటనలో నల్ల జెండాల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. మోడీ పర్యటన సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డేగా పాటిస్తోందన్నారు. అటు తమ పార్టీ నాయకుల్ని తీసుకునే పార్టీలన్నీ బ్రోకర్‌ పార్టీలే అంటూ ధ్వజమెత్తారు. తమ వ్యతిరేక పార్టీలన్నీ తమకు సమాన శత్రువులేనన్నారు రఘువీరారెడ్డి.

leave a reply