పిల్లలపై ప్రమాణం..

సోషల్ మీడియాలో ప్రత్యర్ధి పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారాల పై వైఎస్ షర్మిల హైదరాబాద్ సీపి అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. తనను కించపరుస్తూ అవమానానికి గురి చేసేలా కొందరు ప్రవర్తిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

“తనకు, హీరో ప్రభాస్ కి సంబంధం ఉందని 2014 ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసి లాభం పొందాలని చూశారు. నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను. నేను ఇంత వరకు ప్రభాస్ అనే వ్యక్తిని నేరుగా చూడడం కానీ మాట్లాడడం జరగలేదు. దీంతో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది అంతటితో ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ టిడిపి వాళ్లు కొత్త ప్రచారానికి తెరతీస్తున్నారు.

నేను ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా నా నైతికతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏందో నాకు తెలుసు. కానీ, ఒక మహిళగా నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. కొందరు కావాలని పని గట్టుకొని ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా.. మేం వారి పై ప్రచారాలు చేయలేమా. ఈ మధ్య జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. అన్ని తెలిసిన పెద్ద మనిషి కూడా ఈ రకంగా మాట్లాడడం చూస్తుంటే నేతలు ఎంత దిగజారి పోయారో అర్దమవుతుంది.

ఈ తప్పుడు ప్రచారాలపై స్పందించకుంటే అంతా నిజమనే నమ్మే అవకాశం ఉంది. అందుకే పోలీసు కంప్లయిట్ ఇవ్వడమే కాకుండా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాను. నాకేవరితో సంబంధం లేదు. ఇలా నేను నిజాయితి పరురాలిని అని చెప్పుకోవాల్సి రావడం యావత్తు మహిళా లోకానికి జరిగిన అవమానంగా భావించాల్సి ఉంది. గతంలో నా తండ్రి పై కూడా ఫ్యాక్షనిస్టు, నక్సలైట్ అని ముద్ర వేశారు. ఇప్పుడు నా జీవితాన్ని అపహస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారు.” అని షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు.

leave a reply